Tirumala: తిరుమలలో మొబైల్ పోతే శ్రీవారి భక్తులు ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి
Tirumala News: మొబైల్ హంట్ వాట్స్ అప్ ద్వారా గత నాలుగు నెలల్లో 780 సెల్ ఫోన్స్ రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.
తిరుపతి : మొబైల్ హంట్ వాట్స్ అప్ ద్వారా గత నాలుగు నెలల్లో 780 సెల్ ఫోన్స్ రికవరీ చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదవ విడతలో నేడు 400 సెల్ ఫోన్స్ రికవరీ చేశామని, వీటి విలువ 2 కోట్ల, 12 లక్షలు, 40 వేలు ఉంటుందని వివరించారు..
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా సెల్ ఫోన్ చోరీ గురైతే మొబైల్ హంట్ వాట్సాప్ నంబర్ 9490617873 పిర్యాదు చేయాలని సూచించారు.. శ్రీనివాససేతు వంతెనపై మద్యం సేవిస్తున్నట్లు పిర్యాదుల నేపథ్యంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. యువత కొంత మంది గ్రూప్ లుగా తిరుగుతున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హతీరాంజీ మఠం సీజ్ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు విచారణ కొనసాగుతోందని, పూర్తి స్థాయి నివేదిక వస్తే స్వామీజీను అదుపులోకి తీసుకుంటామన్నారు. సైబర్ క్రైమ్ నేరాలు సంఖ్య తగ్గింది, ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటి వరకు చోరీకి గురైన, కనిపించకుండా పోయిన 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ చాలా ప్రయోజనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ లోని సీటీవో భవనంలో అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రయోజనాలు వెల్లడించారు. ఈ పోర్టల్ లోని టాప్‌కాఫ్( టీఏఎఫ్సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సదుపాయంతో నకిలీ ఫోన్ నంబర్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
దొరకవు అనుకున్న ఫోన్లు దొరికాయి
ఆధునిక సాంకేతికత సాయంతో మొబైల్ ఫోన్ దొంగలు ఆట కట్టించారు చిత్తూరు జిల్లా పోలీసులు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఐదు వందలకు పైగా ఫోన్లను రికవరీ చేసి వాటిని బాధితులకు అందజేశారు. చిత్తూరు జిల్లాలో కొట్టేసిన ఫోన్లు జమ్మూ కశ్మీర్ లో ఉన్నప్పటికీ లేటెస్ట్ చాట్ బాట్ టెక్నాలజీ ఉపయోగించి గుర్తించినట్టు ఎస్పీ విశ్వంత్ రెడ్డి తెలిపారు. కొన్ని కేసుల్లో భాదితుల ఫిర్యాదు అందిన 4 గంటల లోపు మొబైల్ ఫోన్ రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఇక దొరకవు అన్న ఫోన్లు మళ్ళీ తమ కళ్ళ ముందు కనిపించేటప్పటికి బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసుల “చాట్ బాట్” సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితులు మళ్లీ పొందవచ్చునని తెలిపారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బృందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు.
చాట్ బాట్‌కు వివరాలు ఇలా పంపించాలి
ముందుగా 9440900004 నంబర్ వాట్సాప్ కు HI, లేదా Help టెక్ట్స్ మెసేజ్ పంపాలి. తర్వాత వెనువెంటనే Welcome to Chittoor Police పేరున ఒక లింకు వస్తుంది. ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. జిల్లా, పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్ట్ నంబర్, మిస్సయిన మొబైల్ మోడల్, IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ వివరాలను సబ్మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది. తర్వాత ఆ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రికవరీ చేసేందుకు చాట్ బాట్ బృందం నిపుణులు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.