Tiger Cubs In Tirupati Zoo: తిరుపతికి చేరుకున్న పులి పిల్లలు, ఎస్వీ జూ పార్కులో వాటి సంరక్షణ
Tiger Cubs In Tirupati Zoo: నంద్యాల జిల్లాలో లభ్యమైన నాలుగు పులి పిల్లలను వాటి సంరక్షణార్థం తిరుపతి ఎస్వీ జూ పార్కుకు తరలించారు. వాటికి బలమైన ఆహారం అందిస్తూ.. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
Tiger Cubs In Tirupati Zoo: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో తల్లి నుండి వేరు అయిన నాలుగు పులి పిల్లలు లభ్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దపులి సంచారంతో భయపడ్డ గ్రామస్థులు.. పులి పిల్లలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి నాలుగు పులి పిల్లలను రక్షించారు. పులి పిల్లల కోసం పులి వస్తుందేమో అని ఫారెస్టు అధికారులు అనేక విధాలుగా ప్రయత్నం చేసినా పెద్దపులి జాడ ఏమాత్రం కనిపించలేదు. అయితే ఈ పులి కూనల సంరక్షణార్థం తిరుపతి ఎస్వీ జూ పార్కుకు అప్పగించారు.
జూపార్కులో ఏసీఎఫ్ నాగభూషణం మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాజెక్టు పరిధిలో 50 రోజుల వయసు కలిగిన పులి పిల్లలను అక్కడి జూ అధికారులు మహమ్మద్ సయ్యద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్, ఎస్కార్ట్ సిబ్బందితో కలిసి అప్పగించారని తెలిపారు. వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో వాటి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించినట్లు వివరించారు. తల్లి నుండి విడిపోయిన తర్వాత ఫీడింగ్ లేక పోవడంతో కొంత బలహీనంగా ఉన్నాయన్నారు. వైద్యుల పర్యవేక్షణలో బలవర్ధకమైన ఫీడింగ్ అందజేసి, మంచి వాతావరణంలో పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటే, ఏసీలో వాటిని ఉంచి రక్షిస్తామని అన్నారు. వెటర్నరీ వైద్యులతో తరచుగా తనిఖీ చేయిస్తుంటామన్నారు.
నాలుగు రోజుల కిందట లభ్యమైన పులి పిల్లలు..
వన్య మృగాలు జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఇటీవల ఏపీలోని పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం ప్రజల్ని హడలెత్తించింది. తాజాగా నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లల కలకలం రేపుతున్నాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్తులు గుర్తించారు. కుక్కలు దాడిలో గాయ పరచకుండా పులి పిల్లలను గదిలో భద్రపరిచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు.
ఓ ఇంటి వద్ద గోడకు ఆనుకొని ఉన్న పులిపిల్లలు
నంద్యాల జిల్లా ఆత్మకూరు, నందికొట్కూరు, వెలుగోడు ప్రాంతాల్లో తరచూ పెద్ద పులులు సంచరిస్తున్నాయి. ఇటీవల ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తాజాగా నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో పెద్దపులి పిల్లలు కలకలం రేపుతున్నాయి. కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో ఆదివారం ఓ యువకుడికి పెద్దపులి పిల్లలు కనిపించాయి. గ్రామంలోని ఓ ఇంటి వద్ద గొడకు ఆనుకుని పులి పిల్లలు నిద్రపోతుండగా యువకుడు వాటిని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఒకేసారి నాలుగు పులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులి పిల్లలు ఉన్నాయంటే సమీపంలోనే పెద్ద పులి ఉండి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. పిల్లలు కోసం పెద్ద పులి మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కుక్కల దాడి నుంచి రక్షించేందుకు పులి పిల్లలను స్థానికంగా ఓ గదిలో ఉండి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.