Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Tirumala News | జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు. ఆ సమయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.

Vaikunta Dwara Darshanam at Tirumala | తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వేడుకలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం ఒకటి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు పది రోజులపాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఈ మేరకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం సందర్భంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు
- దర్శన టోకెన్లు/ టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అనుమతిస్తుంది. టోకెన్లు లేని భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. కానీ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
- పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రద్దు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం.
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు (VIP Break Darshanam) పది రోజుల పాటు రద్దు.
- భారీ క్యూలైన్లు నివారించి అధిక సంఖ్యలో శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
- గోవిందమాల ధరించిన భక్తులకు సైతం ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు అని టీటీడీ స్పష్టం చేసింది. దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తారు.
- జనవరి 09 నుంచి 19వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తూ నిర్ణయం
- జనవరి 10న స్వర్ణ రథం ఊరేగింపు కార్యక్రమంతో పాటు, జనవరి 11న చక్ర స్నానం ఎస్వీబీసీ (SVBC)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
- తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ 10 రోజుల పాటు అన్న ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
- శ్రీవారి భక్తులకు కేటాయించిన టైంస్లాట్ ప్రకారమే వారు ఆలయంలో క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
- మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించడం లేదని టీటీడీ తెలిపింది. 11 నుండి 19వ తేది వరకు వీరిని వైకుంఠ ద్వారా దర్శనాలకు అధికారులు అనుమతిస్తారు.
- 3 వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్& గైడ్స్ ను నియమించుకోవడం. శ్రీవారి ఆలయంలో వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Tirumala news: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - తిరుమలలో 10 రోజులపాటు వైకుంఠ ఏకాదశి దర్శనం
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నవంబర్ నెలలో తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం తెలిసిందే. వైకుంఠ ఏకాదశికి కావాల్సిన పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌ల నియామకం, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర అంశాలపై ఆయన చర్చించారు. తాజాగా టీటీడీ పాలకమండలి సమావేశమై వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులకు పలు సూచనలు చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

