Tirumala News: అలిపిరి నడక మార్గంలో నాగుపాము కలకలం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Tirumala News: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఆరడుగుల నాగు పాము హల్ చల్ చేసింది. బుసలు కొడుతున్న పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు.
Tirumala News: తిరుమల అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం వద్ద నాగుపాము కలకలం రేపింది. దాదాపు ఆరు అడుగుల నాగుపాము ఒక్కసారిగా నడక మార్గంలోకి రావడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎంతసేపు గడిచినా నాగుపాము అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా అక్కడే బుసలు కొడుతూ ఉండడంతో టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించారు. దీంతో వెంటనే ఆయన ఘటనా స్ధలంలోకి చేరుకున్నారు. బుసులు కొడుతున్న నాగుపామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలి పెట్టారు. దీంతో భక్తులు, దుకాణదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పామును పట్టుకున్న భాస్కర్ నాయుడుతో భక్తులు సెల్ఫీలు దిగారు.
టీటీడీ ఫిల్టర్ హౌస్ సిబ్బందిని పరుగులు తీయించిన జెర్రిపోతు..
తిరుమలలోని టీటీడీ ఫిల్టర్ హౌస్ లో ఏడు అడుగుల జెర్రిపోతు ప్రత్యక్షమైంది. సోమవారం మధ్యాహ్నం జెర్రిపోతును చూసిన ఫిల్టర్ హౌస్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడికి సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న ఆయన చాకచక్యంగా జెర్రిపోతును పట్టుకుని అవ్వాచారి కోనలో వదిలి పెట్టారు. దీంతో ఫిల్టర్ హౌస్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
పాములు పట్టే క్రమంలో మూడు సార్లు పాముకాటుకు గురైన భాస్కర్ నాయుడు
నాగుపాము, జెర్రిపోతు, కొండచిలువ, గుడ్డి పింజరి, కట్లపాము, దాసరి పాము, బిల్లెరికి వంటి ప్రమాదకరమైన పాములను భాస్కర్ నాయుడు బంధించేవారు. ఈ క్రమంలో ఆయన మూడు సార్లు పాము కాటుకు గురయ్యారు. ఓసారి వేలుకు విషం ఎక్కడంతో ఆ వేలు చివరి భాగం వరకు వైద్యులు తొలగించారు. అయినా భక్తుల సేవ పరమావధిగా భావించి భాస్కర్ నాయుడు పాములకు భయపడకుండా నిరంతరం భక్తులకు సేవలు అందించారు. టీటీడీ అనుబంధ ఆలయాలు, టీటీడీకి సంబంధిన కార్యాలయాల్లో, స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీల్లో పాములు వస్తే ముందుగా భాస్కర్ నాయుడికే ఫోన్ కాల్ వస్తుంది. ఇలానే గతేడాది ఎస్వీ యూనివర్సిటీ నుండి ఫోన్ వచ్చింది. వర్సిటీలో ఓ గదిలో పాము వచ్చిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో హుటాహుటినా అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టేందుకు ప్రయత్నించే సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో చేతిలోని ఫోన్ లో టార్చ్ లైట్ వేసుకుని పామును పట్టేందుకు ప్రయత్నించారు. ఇంతలో చేతికి వేసుకున్న గ్లౌజ్ జారి పోయింది. అదే సమయంలో పాము అతని చేతిపై కాటు చేసింది.
గతేడాది జులైలో కూడా ఆరగుడుల నాగుపాము
తిరుమలలోని పురోహిత సంఘం వద్ద పాము హల్ చల్ చేసింది. ఆరు అడుగుల నాగుపాము బుసలు కొడుతూ భక్తులను భయపెట్టింది. పామును చూసిన భక్తులు, సిబ్బంది పరుగులు తీశారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. పురోహిత సంఘం వద్దకు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పెట్టే ప్రయత్నం చేశారు. తోకను ముట్టుకోగానే పడగవిప్పిన నాగు కాటు వేసే ప్రయత్నం చేసింది. పాటు కాటు నుంచి భాస్కర్ నాయుడు తృటిలో తప్పించుకున్నారు. కొంత సేపు పామును రోడ్డుపై పడగ విప్పుకొని ఉండటంతో అక్కడ ఉన్న సిబ్బంది సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. రెండో సారి కూడా కాటు వేసే ప్రయత్నం చేసింది. అనంతరం భాస్కర్ నాయుడు చాకచక్యంగా పామును పట్టుకొని అవ్వాచారి కోణలో విడిచిపెట్టారు. కొన్ని రోజుల క్రితం భాస్కర్ నాయుడు పాము కాటుకు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోలుకున్న తర్వాత మళ్లీ తన డ్యూటీ మొదలుపెట్టేశారు.