TTD News: టీటీడీ తీరుపై పీఠాధిపతులు, మఠాధిపతుల ఆగ్రహం - త్వరలో తిరుపతిలో భారీ సభ
శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని పీఠాధిపతులు తీవ్ర విమర్శలు చేశారు.
హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేస్తున్న టీటీడీ అధికారులు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం స్వప్నా నందుల ఆశ్రమం శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి విమర్శించారు. తిరుమల శ్రీవారిపై జరుగుతున్న అపోహలను తెలుసుకోవడానికి సుమారుగా 40 మందిపైగా పీఠాధిపతులు, మఠాధిపతులు తిరుమల శ్రీవారి సన్నిధికి వచ్చారు. శ్రీవారి సన్నిధికి వెళ్ళకుండా అధికారులు అడ్డుకున్నారని, టీటీడీ ఈవో ఇతర కులానికి చెందిన వారిగా ఉన్నాడని తీవ్ర విమర్శ చేశారు శ్రీవారి దగ్గరికి వెళ్లాలంటే పీఠాధిపతులు కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాలని అన్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో శ్రీవారికి నిలువునామం కూడా తీసివేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న అధికారులు వారి మనోభావాలు దెబ్బ తినేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. టీటీడీ ఈవోపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కులాలకు మతాలకు అతీతంగా అందర్నీ సమానంగా పీఠాధిపతులు, మఠాధిపతులు చూస్తారని, అలాంటి వారికే తీవ్ర అవమానం జరిగేలా టీటీడీ సిబ్బంది ప్రవర్తించారని అన్నారు. హిందూ ధార్మిక సంస్థలపై జరుగుతున్న దాడిపై, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వారితో పీఠాధిపతులు, మఠాధిపతులు కలిసి లక్షలాది మంది హిందువులతో, హిందూ మహాసభను తిరుపతి నగరంలో నిర్వహించబోతున్నట్లుగా శ్రీశ్రీశ్రీ చంద్రమౌళీశ్వర స్వామి స్పష్టం చేశారు.
వైభవంగా సాగుతున్న పద్మావతి అమ్మవారి ఉత్సవాలు
శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్రను టీటీడీ అధికారులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారి పాదాల చెంత లక్ష్మీ కాసుల హారాన్ని ఉంచి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం హారతి సమర్పించి ఆలయం వెలుపలకు తీసుకొచ్చి, తిరుమాడ విధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్ర అనంతరం టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయని అన్నారు. అమ్మవారు తన ఇష్ట వాహనమైన గజ హవనంపై విహరిస్తూ, ఆలయ మాడ విధుల్లో భక్తులను కటాక్షించనున్నారని తెలిపారు. శ్రీవారి కాసుల హారాన్ని గజవాహనంపై విహరించే అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ అధికారులు వివరించారు.
గర్భాలయంలో స్వామి వద్ద ఉంచి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చామని... అనంతరం కాసుల హారాన్ని శ్రీవారి ఆలయం నుంచి బయటకు తీసుకొచ్చి తిరుచానూరుకు పంపనున్నామని చెప్పారు. ఈనె 28వ తేదీ పంచమి తీర్థం సందర్భంగా ఆరోజు వేకువజాము అమ్మవారికి సారె తిరుమల నుంచి తీసుకెళ్లనున్నామని చెప్పారు. అశేష సంఖ్యలో భక్తులు పంచమి తీర్థంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపధ్యంలో భారీ ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈనెల 28వ తేదీన పంచమి తీర్థం వేడుకలతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని అన్నారు.
ఈరోజు ఉద పల్లకీ ఉత్సవం పై, రాత్రి గజవాహనంపై, 25వ తేదీన శుక్రవారం ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గరుడ వాహనం, 26వ శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై, 27వ ఆదివారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనంపై, 28వ తేదీన సోమవారం పంచమీ తీర్థాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించడంతో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని పద్మావతి అమ్మవారి ఆలయం ప్రధాన అర్చకులు బాబు స్వామి తెలిపారు. ఇక పంచమితీర్థం రోజు భద్రతా విధులకు 2500 మంది పోలీసులను వాడబోతున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో భక్తులకు సేవలందించే విధంగా టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి చర్యలు తీసుకున్నారు.