మదనపల్లెలో షాజహాన్ బాషాకు టీడీపీ, జనసేన నేతలు సహకరిస్తారా ? రెబెల్స్‌గా పోటీ చేస్తారా ?
Chittoor News: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపికి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది.
Andhra Pradesh Assembly Elections : ఉమ్మడి చిత్తూరు (Chittoor)జిల్లాలోని మదనపల్లె (Madanapalle) నియోజకవర్గం టిడిపి (TDP)కి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ నేతలు, కేడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో...చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. ఆశావహుల జాబితా కూడా చాలా పెద్దదే. ఇలాంటి సమయంలో మదనపల్లి అసెంబ్లీ టికెట్...మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా (Shajahan Basha)కు ఇచ్చింది. ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు సహకరిస్తారా ? లేదా రెబెల్స్ గా పోటీ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎంతకాలం అన్నదమ్ములను గెలిపించాలంటోన్న టీడీపీ కేడర్
ఓ రాష్ట స్థాయి నాయకుడు మద్దతుతో షాజహాన్...మదనపల్లి టికెట్ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి నేతలు అధిష్ఠానం మీద గుర్రుగా ఉన్నారు. నియోజకవర్గంలోని ఇటు నేతలు...అటు కేడర్ ఎప్పుడూ లేనంతగా రగిలిపోతున్నారు. ఇన్నేళ్ళు పార్టీ కోసం కష్టపడి పడి పని చేసిన వారిని కాదని...కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు అన్నపోతే తమ్ముడు...తమ్ముడు పోతే అన్నను ఎమ్మెల్యేగా గెలిపించాలా అంటూ పంచ్ డైలాగ్‌లు పేలుస్తున్నారు. ఇది కాస్తా పార్టీ పెద్దల దృష్టి కెళ్ళినట్లు సమాచారం. షాజహన్ కుటుంబానికి టిడిపి సీటు ఇవ్వడంపై పార్టీ కేడర్‌లో భిన్నమైన వాదనలు ఉన్నాయి. మదనపల్లె తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం షాజహాన్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
మూడు పార్టీల నేతలు రహస్య సమావేశాలు
షాజహాన్‌కు టికెట్ ఇవ్వడంతో...2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన దొమ్మలపాటి రమేష్, 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రాందాస్ చౌదరి ఆశలపై నీళ్ళు చల్లినట్లు అయింది. దీంతో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న వీరిద్దరూ...ఇక లాభం లేదనుకుని బిజెపి నేత బండి అనంద్ ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారు. వీరితో పాటు మండలస్థాయి నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు హాజరయ్యారు. 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహాణతో పాటు అనేక కేసులు ఎదుర్కొన్నామని సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడైన షాజహాన్ బాషాకు టికెట్ ఇవ్వడం తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో సోదరుడి ప్రభావం ఖచ్చితంగా పడుతుందని...ఓడిపోయే అవకాశం ఉంటుందని టికెట్ ఆశించిన నేతలు వాదిస్తున్నారు.
రెబెల్స్ గా పోటీ చేసేందుకు ముగ్గురు నేతలు రెడీ
గత ఐదేళ్ల కాలంలో నవాజ్ బాషా వ్యవహారించిన తీరు...టిడిపి నేతలపై కేసులు పెట్టించడం, టార్గెట్ చేస్తూ వేధించడాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైసీపీనే టికెట్ ఇవ్వకుండా బయటకు పంపిందని చెబుతున్నారు. నవాజ్ బాషాకు టికెట్ ఇవ్వకుండా బలమైన మైనార్టీ నేత నిస్సార్ ఆహ్మాద్‌కు అవకాశం ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షాజహాన్ బాషా ఎలా గెలుస్తారని నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్‌కు చెప్పాలని నేతలంతా ఏకగ్రీవం తీర్మానం చేశారు. అధిష్టానం నుంచి పిలుపు వస్తే సరే...లేక పోతే టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలసి ఎవరికి వారు రెబల్స్ బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇలా ముగ్గురు నేతలు పోటీకి దిగితే...తన పరిస్థితి ఎంటని షాజహాన్ బాషా టెన్షన్‌లో పడుతున్నట్లు తెలుస్తోంది. రెబల్స్ గొడవను పార్టీ ఎలా డిల్ చేస్తుంది... తమ్ముడు ఎఫెక్ట్ అన్నమీద లేకుండా ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందన్నది ఆసక్తికరంగా మారింది.