Tirupati Airport: తిరుపతి ఎయిర్‌పోర్టు అధికారులు-లీడర్స్ మధ్య రగడ.. ఆయన తీరే కారణమా! ప్రతీకారం కూడా..?
తిరుపతి ఎయిర్ పోర్టు అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య రగడ చోటు చేసుకుంది. ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు ప్రోటోకాల్ విషయంలో ప్రముఖులను అవమానాలకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రధానమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రేణిగుంట ఎయిర్ పోర్టు కూడా ఒకటి. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల ఉండడంతో ఎంతో మంది భక్తులు వివిధ దేశాల నుండి రాష్ట్రాల నుండి, రాక పోకలు సాగుతుంటాయి. అయితే ఎయిర్ పోర్టు అథారిటీ అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కారణంగా వివాదాలకు రేణిగుంట ఏయిర్ పోర్టు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడికి వచ్చే ప్రయాణికులనే కాదు, రాజకీయ నాయకులను, పారిశ్రామిక వేత్తలను నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా వారిని అవమానానికి గురి చేస్తున్నారు. నిత్యం ఇక్కడకు వివిధ అత్యున్నత స్ధాయి కలిగిన రాజకీయ ప్రముఖులు, బడా పారిశ్రామిక వేత్తలు వివిధ పనుల కారణంగా వస్తుంటారు. ఇలా వచ్చిన వారికి స్థానిక రాజకీయ నాయకులు వారికి స్వాగతం పలికేందుకు వెళ్ళడం అనేది సర్వసాధారణం. ఇలా వెళ్ళిన వారికి నిత్యం అవమాన భారంతో వెను తిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గత రెండు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. అయితే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికేందుకు ప్రోటోకాల్ ప్రకారం తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వెళ్ళారు. పీఏతో కలిసి ఎయిర్ పోర్ట్ లోపలికి ప్రవేశిస్తున్న అభినయ రెడ్డిని ఎయిర్ పోర్ట్ అథారిటీ మేనేజర్ సునీల్ అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఎటువంటి ప్రోటోకాల్ లేవని అడ్డుకున్నాడు, అయితే, తాను స్థానిక ఎమ్మెల్యే కుమారుడని, డిప్యూటీ మేయర్ అని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు చెప్పినా ఫలితం లేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది.
దీంతో నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. వాస్తవానికి ప్రోటోకాల్ నిబంధనల మేరకు డిప్యూటీ మేయర్ స్థాయి ప్రజా ప్రతినిధి మరో ఇద్దరితో కలిసి తిరుపతికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలికేందుకు అనుమతి ఉంది. అయితే ఎయిర్ పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేష్ వ్యవహార శైలి వల్ల నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ఎయిర్ పోర్ట్ అథారిటీ మేనేజర్ సునీల్ తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి ఇద్దరు నేనేంటో చూపిస్తా అని ఒకరినొకరు దుర్భాషలాడుతూ బయటకు వచ్చారు.
గవర్నర్ విషయంలోనూ..
రేణిగుంట ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ గతంలో మేనేజర్‌గా పని చేసి తిరిగి రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు డైరెక్టర్ హోదాలో వచ్చారు. అయితే డైరెక్టర్ హోదాలో వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది.. అప్పటి నుంచి తరచూ ఆయన వ్యవహార శైలిపై ఎయిర్ పోర్ట్ లో పని చేసే సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తీవ్రంగా ఇబ్బందులకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వచ్చినా ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చేందుకు డైరెక్టర్ విముఖత చూపారు. అప్పటికి బిశ్వభూషణ్ ఇంకా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించలేదని చెప్పడం విస్మయానికి గురి చేసింది.
ఆర్థిక మంత్రి బుగ్గనకూ చేదు అనుభవం
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తిరుపతి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. గత ఏడాది జూన్ నెలలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తిరుపతి పర్యటన తరువాత కేంద్ర మంత్రికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన ఆ సమయంలో చేదు అనుభవం ఎదురుకావడంతో పలువురు మండిపడ్డారు. రన్ వేకు వెళ్లే రెండో గేటు దగ్గర మంత్రి బుగ్గనను సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీంతో తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిని అని వారికి విన్నవించినా ఫలితం లేక వెను తిరిగారు. ఇక తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డికి ఇలాంటి అవమానాలు తప్పలేదు.
మంత్రులకు కూడా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు వచ్చిన సమయంలో చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, చిత్తూరు ఇన్చార్జి మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డికి కూడా రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో అవమానాలు తలెత్తాయి. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కాన్వాయ్‌తో వెళ్లాల్సిన మంత్రులు వాహనాలను ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ఆపివేశారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు తరచు ప్రజాప్రతినిధులకు జరుగుతుండడం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో సర్వసాధారణంగా మారి పోయింది.
తెలుగు గంగ నీటి నిలిపివేత
డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డికి రేణిగుంట ఎయిర్ పోర్ట్ మేనేజర్ సునీల్ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి నిబంధనలకు విరుద్దంగా తిరుపతిలోని ఎయిర్ పోర్ట్ అథారిటీ సిబ్బంది నివాసాలకు వెళ్లే తెలుగు గంగ నీటిని నిలిపివేశారు. అంతే కాకుండా రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్ళె తెలుగు గంగ నీళ్లు వెళ్లకుండా పైపులైను నిలిపివేయడంతో ట్యాంకుల ద్వారా రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కి, తిరుపతిలోని ఎయిర్ పోర్ట్ సిబ్బంది నివాసాలకు నీటిని తరలిస్తున్నారు. తిరుపతిలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సిబ్బంది ఉండే క్వార్టర్ల ముందు భాగంలో ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వేయడం, డ్రైనేజీ వ్యవస్థను సైతం నిలిపివేయడంతో అక్కడి వాహనాలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అథారిటీ డైరెక్టర్ సురేష్ తమ సమస్యను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు.
కానీ, అది మేయర్ పరిధిలోనిదని చెప్పడంతో డైరెక్టర్ సురేష్ కి చేదు అనుభవం ఎదురైంది. తెలుగు గంగ నీరు కలిషితం అయ్యే విధంగా డ్రైనేజీ నీరు వస్తుందని దానికి భాధ్యత తనదేనని లిఖితపూర్వకంగా లేఖ సమర్పిస్తే నీటిని వదులుతానని కార్పొరేషన్ తెలియజేయడంతో ఎయిర్ పోర్ట్ అథారిటీ డైరెక్టర్ సురేష్ లేఖను సమర్పించకుండా వెను తిరిగారు. అయితే కార్పొరేషన్ వర్సెస్ ఎయిర్ పోర్ట్ అథారిటీకి మధ్య జరుగుతున్న రగడ ఎక్కడ వరకు దారి తీస్తుందో అన్న చర్చ తిరుపతిలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి