Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం
సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పనేం లేకుండా పోయిందని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఇతర సమస్యలపై కూడా మీడియా పట్టించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ నాయకులు సహా సినీ ప్రముఖులను విలేకరులు పదే పదే ఆ అంశంపై స్పందించాలని కోరుతున్నారు. ప్రెస్ మీట్లు లేదా ఏవైనా కార్యక్రమాల్లో వారంతా విలేకరుల నుంచి ఈ ప్రశ్నను ఈ మధ్య తరచూ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి అయిన పేర్ని నానికి కూడా మళ్లీ ఆ ప్రశ్న ఎదురైంది. ఆయన తరచూ ఎగ్జిబిటర్లు, సినీ పరిశ్రమకు చెందిన వారితో సమీక్షలు నిర్వహించడం, అనంతరం ప్రెస్ మీట్లు పెట్టి సినిమా టికెట్ల అంశంపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. మరో కార్యక్రమంలో మళ్లీ సినిమా అంశానికి సంబంధించే ప్రశ్నలు విలేకరుల నుంచి ఎదురు కావడంతో కాస్త అసహనానికి లోనయ్యారు.
సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పనేం లేకుండా పోయిందని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో ఇతర సమస్యలపై కూడా మీడియా పట్టించుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కే కన్వెన్షన్‌లో ఎన్టీఆర్ టు వైఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పోటీల తొలి రోజు విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందుకు మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పేదల సంక్షేమానికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ల పేరిట పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. పశు సంపద, సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా మంత్రి కొడాలి నాని సోదరులు అయిదేళ్లుగా ఇలాంటి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు.
ఈ సందర్భంగానే ఆ కార్యక్రమానికి కవర్ చేసేందుకు వచ్చిన విలేకరులు సినిమా టికెట్ల ధరలపై ప్రశ్నలు అడిగారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రజలకు, వ్యవస్థలకు అవసరమైన విషయాలపై మీడియా స్పందిస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. మీడియాకు సినిమా టికెట్ల విషయం తప్ప వేరే ఏమీ లేవా అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రెండు పాలపళ్ల ఎద్దుల విభాగం పోటీల్లో గెలిచిన వారికి మంత్రి పేర్ని నాని నగదు బహుమతులు, బహుమతులు ప్రదానం చేశారు.
Also Read: పవన్‌ను పదే పదే టార్గెట్ చేస్తున్న సోము వీర్రాజు ! బీజేపీ -జనసేన మధ్య దూరం పెరుగుతోందా ?
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?