Nara Lokesh: ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడడం ఎనిమిదో వింత - లోకేశ్ ఎద్దేవా
AP Latest News in Telugu: సీఎం జగన్ ను లోకేశ్ ఎద్దేవా చేశారు. పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు.
Nara Lokesh Comments on CM Jagan: ప్రిజనరీ జగన్ విజన్.. గురించి మాట్లాడుతున్నారని.. ప్రపంచంలో ఏడు వింతల్లో ఇది ఎనిమిదో వింత అని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దొబ్బేసి జైల్లో ఉండివచ్చిన వ్యక్తికి విజన్ ఉంటుందా అని లోకేశ్ ప్రశ్నించారు. మద్యం ద్వారా ఎలా సంపాదించాలి? క్వారీల్లో ఎలా డబ్బులు సంపాదించాలి. ఇసుకలో ఎలా డబ్బులు లేపేయాలో వారికి ఆలోచన ఉంటుందని అన్నారు. కానీ ఉత్తరాంధ్రకు వెళ్లిన తనకు విజన్ ఉంది అంటున్నాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. పెనుగొండ శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు.
‘‘మూడేళ్లుగా 3 రాజధానులతో మనల్ని ఆడుకున్నాడు. విశాఖలో జగన్ మొదట చేసింది ఏంటో తెలుసా? రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. బాత్రూమ్ లో రూ.25 లక్షలతో కమోడ్ పెట్టుకున్నాడు. బస్ షెల్టర్ కు కూడా ఫోటోలు పెట్టుకున్నాడు. అవి గాలి వస్తే ఊడిపోతున్నాయి. ఇటీవల సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే అది కూడా కొట్టుకుపోయింది. సీఎంగా మళ్లీ విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తానని అంటున్నాడు.
జగన్ ది దరిద్రపు పాదం. విశాఖలో అడుగుపెట్టగానే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకైంది. రెండో సారి బాయిలర్లు, రియాక్టర్లు పేలాయి. మొన్న బైజూస్ కూడా తగలబడి పోయింది. విశాఖ వెళ్లి మళ్లీ సిద్ధం అంటున్నాడు..మీకు ప్రజలు అంతిమ యాత్ర సినిమా చూపిస్తారు. మొన్న ఒక గ్రాఫిక్స్ చూపించాడు...ఆ టవర్లు చూస్తే కోడికత్తి టవర్స్ గుర్తొచ్చాయి. వివరాలు వాకబు చేస్తే సాక్షిలో తయారు చేశారని చూపారు. రెండు కోడికత్తులు కలిపి చేసిన టవర్స్ చూపించారు. కనీసం దానికి ఎంత ఖర్చు అవుతోంద కూడా తెలీదు.
బాబాయ్ ని లేపేసింది ఎవరు? ఆప్షన్ -1 జగన్, ఆప్షన్-2 అవినాష్ రెడ్డి, ఆప్షన్-3 భాస్కర్ రెడ్డి, ఆప్షన్-4 పైనున్న వారందరూ...ఏది కరెక్టు..నాలుగోది. మొదట గుండెపోటు అని శవానికి కుట్లు వేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని చూశారు. హత్య జరిగిన తర్వాత రోజు చంద్రబాబు ఫోటోకు చేతిలో కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. కానీ ఇప్పుడు సునీతారెడ్డి బయటకు వచ్చి తన తండ్రిని ఎవరు చంపారో చెప్పారు. హంతకులు ప్రజాప్రతినిధులు అయ్యారని అన్నారు. విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు.
ఏపీలో ప్రజాస్వామ్యం లేదని సునీతారెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ వస్తే వారికి అడ్డంగా సీఎం తిరిగారని సునీత రెడ్డి చెప్పారు. సొంత చెల్లికే భద్రత లేదంటే రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉంటుందా? మరో చెల్లెమ్మ...అన్న విడిచిన బాణం. పాపం ఆమెను కూడా మెడ పట్టి గెంటేశారు. జగన్ మాకు వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రదే. 2 నెలలు ఆగితే ప్రజా ప్రభుత్వం వస్తుంది అవినాస్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. జగన్ ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. బులుగు బటన్ నొక్కి రూ.10 వేస్తాడు..ఎర్రబటన్ నొక్కి రూ.100 లాగుతాడు.
విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచాడు. 3 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు. క్వార్టర్ ధరలు, ఇంటి పన్ను, చెత్తపన్ను ద్వారా బాదుడే బాదుడు. అన్న క్యాంటీన్, పెళ్లికానుక, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇలా వంద సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ప్రజలు పడే కష్టాలను నేను పాదయాత్రలో చూశాను. చంద్రబాబు, పవన్ సూపర్-6 మేనిఫెస్టో విడుదల చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చేదాకా రూ.3 వేలు నిరుద్యగో భృతి అందిస్తాం. చదువుకునే బిడ్డకు రూ.15 వేలు యేటా ఇస్తాం. ఎంతమంది ఉన్నా ఒక్కొక్కొరికి రూ.15 వేలు ఇస్తాం.
రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయంగా యేడాదికి రూ.20 వేలు అందిస్తాం. 18-59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. ప్రతియేటా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళ ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పిస్తాం. జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా...ఎన్నికల ముందు బీసీ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నాడు. కానీ బీసీల వెన్ను విరిచాడు. బీసీలకు జగన్ పొడిచిందేంటి? 26 వేలమంది బీసీలపై దొంగ కేసులు పెట్టారు. 300 మంది బీసీలను హత్య చేశారు.
అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య, జాలయ్య లాంటి బీసీ సోదరులను చంపారు. 30 పథకాలు రద్దు చేశారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించడంతో 16,800 మంది పదవులు కోల్పోయారు. రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. అందుకే బీసీలకు డిక్లరేషన్ తీసుకొచ్చాం. 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేల నెలకు పింఛన్ ఇవ్వబోతున్నాం.
బీసీల రక్షణకు చట్టం తీసుకురాబోతున్నాం. సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. రూ.5 వేల కోట్లతో ఆదరణ ద్వారా పనిముట్లు కూడా అందిస్తాం. చంద్రన్న బీమా 10 లక్షలు, పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష ఇవ్వబోతున్నాం. అధికారుల చుట్టూ ఆరునెలలకు ఒకసారి తిరగకుండా శాశ్వత కుల దృవీకరణ పత్రం ఇస్తాం. పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలు నిర్మిస్తాం.
అనంత జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతజిల్లా ప్రజలు ఎన్టీఆర్ ను గెలిపించి శాసనసభకు పంపారు. అందుకే కరువు జిల్లాకు కియా ను తెచ్చి చంద్రబాబు 50 వేల మందికి ఉపాధి కల్పించారు. 5 ఏళ్లలో 90 శాతం సబ్సీడీతో 1.30 లక్షల మంది రైతులకు డ్రిప్ అందించాం. హార్టి కల్చర్ హబ్ గా మార్చాం. ఏకంగా కరువు వస్తే ట్యాంకర్లు ద్వారా నీరు పంపి చీనీ చెట్లను కాపాడాం. రూ.2 వేల కోట్ల ఇన్ పుట్ సబ్సీడీ కూడా ఇచ్చాం. కానీ దున్నపోతు ప్రభుత్వం వచ్చాక అందరినీ తంతున్నాడు. 30 ఏళ్లలో ఎప్పుడూ రాని కరువు వచ్చింది. రూపాయి అయినా రైతులకు ఇన్ పుట్ సబ్సీడీ వచ్చిందా?’’ అని నారా లోకేశ్ ప్రశ్నించారు.