Anantapur Latest News: కీలక నేత హత్యకు ఎమ్మెల్యే అనుచరుల స్కెచ్- అనంతపురం టిడిపిలో అలజడి- ఇద్దరికీ అధిష్ఠానం పిలుపు
Anantapur Latest News: అనంతపురం అర్బన్ టిడిపిలో ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు మధ్య వర్గ పోరు కీలక మలుపు తిరిగింది. హత్యకు కుట్ర జరిగినట్టు తెలియడంతో అధిష్ఠానం ఇద్దర్నీ పిలిచింది.

Anantapur Latest News: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే దగ్గుబటి వెంకటేశ్వర ప్రసాద్ అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుధాకర్ నాయుడు మధ్య విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. 2024 ఎన్నికల్లో టిడిపి నేత సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు. మొదట్లో అంతా సవ్యంగానే సాగుతున్నప్పటికీ గత కొంతకాలంగా అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వ్యతిరేకత వస్తుందని సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే అనుచరులతో చెప్పడంతో వివాదం మొదలైంది.
సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర :
తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు తనకు ఎమ్మెల్యే అనుచరులతో ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు అధికార పార్టీ నేతలు కావడంతో జిల్లా ఎస్పీ జగదీష్ అత్యంత గోప్యంగా విచారణ చేపట్టి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని నేతల మధ్య వివాదాన్ని ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పించారు. ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ నాయుడుని చంపేస్తామంటూ బెదిరించారని పేర్కొన్నారు.
నేతలను పిలిపించిన అధిష్ఠానం :
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలిపించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అర్బన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న దందాలను గుర్తు చేసినందుకే తనను అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి అధిష్ఠానానికి సుధాకర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఇద్దరు నేతలతో కూడా అధిష్టానం చర్చించినట్లు సమాచారం. ఈ బాధ్యతను టిడిపి సీనియర్ నేత కోవెలపూడి రవీంద్రకు అప్పగించారు.
అనంతపురంలో వర్గ పోరు :
2024 ఎన్నికలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు అనూహ్యంగా టికెట్ వరించడంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వర్గ పోరు మొదలైంది. 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, సుధాకర్ నాయుడు ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు కేటాయించింది. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని అధినేత పలమార్లు చెప్పడంతో ఆ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో పార్టీకి కష్టపడిన వారిని ఎమ్మెల్యే అనుచరులు దూరం పెడుతున్నారని ఆరోపణలు వినిపించాయి. ఎమ్మెల్యేకు కార్యకర్తలకు నగరంలోని ప్రధాన నాయకులకు ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనంతపురంలో కనిపిస్తోంది.





















