Minister Roja: చంద్రబాబు, పవన్ రాసుకుంటే బూడిదే రాలుతుంది - రోజా ఘాటు వ్యాఖ్యలు
Roja Comments: దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని పథకాలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రవేశ పెట్టారని మంత్రి రోజా అన్నారు.
Roja Comments on Chandrabau, Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నాన్ పొలిటీషన్స్ అని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాసుకుంటే రాలేది బూడిదేనని రోజా ఎద్దేవా చేశారు. 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలంటూ విజయనగరం జిల్లా, ఎమ్మెల్సీ రఘురాజు బోడ్డవరం నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర రేణిగుంటకు చేరుకున్న సందర్భంగా మంత్రి ఆర్.కే.రోజా ఎమ్మెల్సీని కలిసి సంఘీభావం తెలిపారు. 42వ రోజు రేణిగుంటకు చేరుకున్న ఎమ్మెల్సీ రఘురాజు పాదయాత్రలో మంత్రి పాల్గొని ఎమ్మెల్సీతో ముచ్చటించారు.
అనంతరం ఏపీ పర్యటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని పథకాలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ప్రవేశ పెట్టారని అన్నారు. అందుకే ఏపీలో మరొక సారి సీఎంగా జగనన్న కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని ఆమె తెలిపారు. వైసీపీలో గొడవ పడి బయటకు వచ్చే వారి కోసం టీడీపీ ఎదురు చూస్తుందని, కానీ పని చేయని వారికి నియోజకవర్గ భాధ్యతల నుంచి తప్పించి, వారికి వేరే బాధ్యతలను జగన్ అప్పజెప్పారని, ఎవరూ ఎన్ని కుట్రలు పొందిన రాబోయే ఎన్నికలలో జగన్ ను గెలిపించుకునేందుకు కలిసి కట్టుగా కృషి చేస్తామని, చంద్రబాబు నాయుడు ఒక్క ప్రతిపక్ష నేతగా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు..
ప్రజలంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను చూసి నవ్వుకుంటున్నారని ఆరోపించారు.. జబ్బును అడ్డం పెట్టుకుని చంద్రబాబు జైల్ నుండి బయటకు వచ్చి న్యాయం గెలిచిందని చెప్పుకుంటున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాసుకుంటే కేవలం బూడిద మాత్రమే రాలుతుందే తప్ప, మరే ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.. లోకేష్ పాదయాత్ర ఎప్పుడూ పూర్తి అయ్యిందో అర్థం కావడం లేదని, 200 కిలోమీటర్లలో 200 సార్లు నారా లోకేష్ రెస్ట్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు, చిత్తూరు జిల్లాలో కనీసం 20 కిలోమీటర్లకే రోజంతా పడుకున్నాడని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, ఆ విషయం టీడీపీ తెలుసుకోవాలన్నారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సమావేశానికి రావాలని పిలిస్తే రాను అని చెప్పిన పవన్, మళ్ళీ ఎందుకు ఒప్పుకున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. దీని బట్టే పవన్ ప్యాకేజీ స్టార్ అని అర్థం అవుతోందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నిలబడి నవ్వుల పాలయ్యాడని, కనీసం బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కు రాలేదని అన్నారు. కేవలం పవర్ లేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఎద్దేవా చేశారు.