RK Roja: చంద్రబాబుది హింసామార్గం, జైల్లో దీక్ష గాంధీని అవమానపర్చినట్లే - రోజా
ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు నాయుడు జీవితమే హింస మార్గమని, ఆయన జైలులో దీక్ష చేస్తున్నారంటే గాంధీజీని అవమానించినట్లేనని ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. సోమవారం ఉదయం తిరుపతిలోని శిల్పారామంలో స్వాతంత్య్ర పోరాట అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ఆర్.కే. రోజా, పాండిచ్చేరి స్పీకర్ సెల్వం, ఎంపీలు గురుమూర్తి, రెడ్డప్ప, మేయర్ డాక్టర్ శిరీషలు శంకుస్ధాపన చేశారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ. అక్షరాస్యత శాతం పెరిగిందని, ప్రజలకు అన్నీ తెలుసునని, సమయం వచ్చినపుడు వారి బాధ్యత నిర్వహిస్తారని ఆయన అన్నారు.
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని, అది చంద్రబాబు విషయంలో రుజువైందన్నారు. పవన్ కళ్యాణ్ కు, రాజకీయ పార్టీ లక్షణాలు రాలేదని, ప్రజలు త్వరలోనే సమాధానం చెప్తారని అన్నారు. కొందరు వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు ఆరు నెలలు సమయం ఉందని అన్నారు. అయినా ప్రస్తుతం జనం, జగన్ ఒక్కటయ్యారని అన్నారు. మిగిలిన వాళ్ళు ఒక్కటైనా ఏమీ పర్వాలేదని, జనం జగన్ ఒక్కటయ్యారని స్పీకర్ తమ్మినేని అన్నారు.
అనంతరం ఏపీ పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే. రోజా మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ జయంతి నాడు ట్రిబ్యుట్ వాల్ కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలం కారణంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, గాంధీజీ నిజమైన వారసుడని అన్నారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ఎన్టీఆర్ ఆనాడే అన్నారని రోజా గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడు జీవితమే హింసా మార్గమని, చంద్రబాబు నాయుడు జైల్లో దీక్ష అంటే గాంధీజీను అవమానించడమేనని ఆమె ఆరోపించారు. కోటి సభ్యత్వం అంటున్న టీడీపీ, కంచాలు మోగించడానికి జనాలు ముందుకు రాలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు దీక్ష దొంగ దీక్ష అని, తాము తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. అటు పవన్ కళ్యాణ్ వాఖ్యలు కూడా ఖండిస్తున్నామని అన్నారు. 15 చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు లేని పార్టీ జనసేన అని, పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ మీది అని ఆమె ఎద్దేవా చేశారు.
సన్నాసి సన్నాసి కలిస్తే బూడిద రాలుతుందని, 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని, మాజీ మంత్రిగా పని చేసిన వ్యక్తి, ఒక మహిళా మంత్రి అయిన తనపై వ్యాఖ్యలు చేశారంటే ఆయన తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థం అవుతుందని ఆమె అన్నారు. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని, మహిళను అవమానించడం నేరమని, రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించారని అన్నారు. స్థాయిని బట్టి కాకుండా ప్రతి మహిళను గౌరవించాలని ఆర్కే రోజా అన్నారు.