Peddireddy: చంద్రబాబుది ప్రాజెక్టుల యాత్ర కాదు, మంచిని చూడలేక చేస్తున్న ఏడుపు యాత్ర: మంత్రి పెద్దిరెడ్డి
Peddireddy Ramachandra Reddy: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక చంద్రబాబు 'ఏడుపు యాత్ర' చేపడుతున్నారని అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
AP Minister Peddireddy: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక చంద్రబాబు 'ఏడుపు యాత్ర' చేపడుతున్నారని అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారని ఒకసారి చూస్తే.. ఆయనకు రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అయిన పుంగనూరు, పీలేరు, మదనపల్లి, కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లి ప్రాంతాలను పోల్చుకుంటే దారుణమైన పరిస్థితి ఉందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆవులపల్లి, నేతిగుంటపల్లి, ముదివేడు రిజర్వాయర్ లతో ఈ ప్రాంతానికి నీటిని అందించాలని, కాలువల ద్వారా అన్ని నియోజకవర్గాల్లోనూ చెరువులను నింపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతిపాదనలు సిద్దం చేశారని, ఈ మేరకు వాటి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. అనంతపురం వాసులకు ఇబ్బంది లేకుండా గండికోట రిజర్వాయర్ ద్వారా నికర జలాలను చిత్తూరు జిల్లాకు నీటిని ఇచ్చేందుకు ఆలోచన చేశారని అన్నారు.
ప్రాజెక్ట్ ల మీద చంద్రబాబు స్టే..
చంద్రబాబు కుటిల బుద్ధితో ఎన్జీటికి ఫిర్యాదుల పంపి, సుప్రీంకోర్ట్ కు వెళ్లి ఈ ప్రాజెక్ట్ ల మీద చంద్రబాబు స్టే తీసుకువచ్చారని మండిపడ్డారు. సొంత జిల్లాకు నీరు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబుకు రాయలసీమ ప్రాజెక్ట్‌ల యాత్ర చేసే నైతిక హక్కు ఎక్కడ ఉందన్నారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనావా నీరు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడని 35 ఏళ్లు ప్రజాప్రతినిధిగా ఉండి కనీసం పలమనేరు దాకా వచ్చిన నీటిని కుప్పం తరలించలేక పోయారని అన్నారు. మరో రెండు నెలల్లో సీఎం జగన్ స్వయంగా వచ్చి పనులు ప్రారంభిస్తారని, కుప్పంకు నీరు అందిస్తామన్నారు. వైఎస్సార్ 95 శాతం హంద్రీనీవా పూర్తి చేస్తే మిగిలిన అయిదు శాతం పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు చేతులు రాలేదనన్నారు.
టీడీపీ హయాంలో హంద్రీ నీవా ద్వారా 5 ఏళ్లలో 133.11 టీఎంసీలు తరలిస్తే జగన్ అధికారం చేపట్టాక నాలుగు ఏళ్లలో 154.46 టీఎంసీలు తరలించి రాయలసీమను సస్యశామలం చేశారని అన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు 9 ఏళ్లు అధికారంలో చంద్రబాబు 1788.75 కోట్లు ఖర్చు చేస్తే రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక 2004 నుంచి 2014 వరకు రూ.2233.70 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు 2014 నుంచి 2019 మధ్య 668.11 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు లీకేజీలకు అడ్డుకట్ట వేయలేదని, ప్రధాన కాలువకు లైనింగ్ కూడా చేయలేదని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచాక 500 కోట్లతో ఆ పనులు పూర్తి చేసి... ప్రతి సంవత్సరం సకాలంలో వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నామన్నారు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు నీరు ఇచ్చి సస్యశ్యామలంగా మారుస్తున్నారు.
గాలేరు నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు 17.52 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4283.08 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో చంద్రబాబు విఫలమైతే వైసీపీ అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్ల రూపాయలతో నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2020 నుంచి ఏటా రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేదని, జగన్ అధికారం వచ్చాక 600 కోట్ల రూపాయలతో పునరావాసం ఏర్పాటు చేసి గరిష్ట స్థాయిలో నీటి నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. 2015 లో శ్రీశైలం నుంచి 800 అడుగుల కంటే దిగువ నుంచి నీటిని తరలించడానికి తెలంగాణ సర్కార్ పాలమూరు - రంగారెడ్డి, డిండి పధకాలను చేపడితే, చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణకు అడ్డంగా దొరికిన బాబు, ఆ కేసు నుండి తప్పించుకోవడానికి కృష్ణ జలాల పై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
అనంతరం ఆయన మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. రాయలసీమ ప్రాజెక్ట్ లపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని అన్నారు. చర్చ పుంగనూరు కంటే కుప్పంలో అయితే బాగుంటుందన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోని ప్రజలకు చంద్రబాబు బుద్ధి బాగా అర్థమవుతుందన్నారు. పుంగనూరులో అయితే చంద్రబాబును ప్రజలు వ్యతిరేకిస్తే, అదికూడా తాము చేయించామని చెప్పుకుంటాడని, కుప్పంలో చర్చకు వస్తే బాగుంటుదన్నారు. తాము ప్రజాస్వామికవాదులమని అన్నారు. చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు తాము దిగజారాల్సిన అవసరం లేదన్నారు.