Botsa Satyanarayana: తిరుపతిలో జరగబోయేది తెలుగుదేశం పార్టీ సభ.... ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా?... టీడీపీపై మంత్రి బొత్స ఫైర్
చంద్రబాబుకు 29 అమరావతి గ్రామాలే ముఖ్యమని, టీడీపీ ఎజెండా అదే అని మంత్రి బొత్స విమర్శించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు, 13 జిల్లాలు అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ విధానం అని మంత్రి స్పష్టం చేశారు.
తిరుపతిలో రేపు జరగబోయే అమరావతి సభను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన..రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, ఓ సామాజికవర్గ దోపిడీ కోసం అమరావతి రాజధాని పేరుతో చేస్తున్న ఆందోళనను త్యాగం అని ఎలా అంటారని ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం కూడా వేలాది మంది రైతులు భూములు ఇస్తారని, అలా భూములు ఇచ్చిన వారిది త్యాగమా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇచ్చిన వారిది త్యాగమా? అన్నది చంద్రబాబు సమాధానం చెప్పాలని మంత్రి బొత్స నిలదీశారు. అమరావతి సభపై ఇంకా దోబూచులాటలు, దొంగాటలు ఎందుకు అని.. టీడీపీ ఎజెండాతోనే ఆ సభ జరుగుతున్నదని బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాలు తప్ప, మిగిలిన 13 జిల్లాలతో సంబంధం లేదని తిరుపతి సభలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటన చేయగలరా..? అని బొత్స ప్రశ్నించారు. ఆ 29 గ్రామాల అభివృద్ధే టీడీపీ ఎజెండా అయితే.. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు, 13 జిల్లాలు అభివృద్ధి కావాలన్నదే ప్రభుత్వ విధానం అని మంత్రి స్పష్టం చేశారు.
టీడీపీ వారే అల్లర్లు సృష్టించేందుకు కుట్ర
అమరావతి యాత్రలో పాల్గొంది టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులే తప్ప స్వచ్ఛందంగా ఏ ఒక్క రైతు పాల్గొలేదని బొత్స విమర్శించారు. తిరుపతి సభలో టీడీపీ వారే అల్లర్లు సృష్టించి, ఆ బురద ప్రభుత్వంపై వేసేందుకు ప్లాన్ చేశారేమో అని టీడీపీపై మంత్రి మండిపడ్డారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యల్లో తప్పేముందని బొత్స అన్నారు. టీడీపీ ఎజెండాకు అనుకూలంగా మాట్లాడితే ఒకలా, వ్యతిరేకంగా మాట్లాడితే మరోలా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటేనని మంత్రి బొత్స అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేస్తామని, రాష్ట్రపతి పాలన పెట్టిస్తామనే హక్కు న్యాయస్థానాలకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
తిరుపతి సభ టీడీపీ ఎజెండాతో
'టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన చూస్తే ఇంకా దోబూచులాటలు అవసరమా.. అని ప్రశ్నిస్తున్నాం. డైరెక్ట్‌గానే టీడీపీ ఎజెండాతో ఈ సభ నిర్వహిస్తున్నామని అంటే సరిపోతుంది. అమరావతిలో 29 గ్రామాల అభివృద్ధి, ఓ సామాజికవర్గాన్ని అభివృద్ధి చేయడం, తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దోచుకోవడం వారి ఎజెండా. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం వైసీపీ ఎజెండా అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లాలనుకోవడం మా పార్టీ విధానం. చంద్రబాబును సూటిగా అడుగుతున్నా... త్యాగాలు అంటున్నారే. రాష్ట్రంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టారు. నాగార్జున సాగర్ కట్టారు. పోలవరం కడుతున్నాం. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎన్నివేల మంది రైతులు తమ భూములను ఇచ్చారు. ఎంతమంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ప్రాజెక్ట్‌లు కడుతున్నాం. చట్టాల ప్రకారం వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తోంది. తద్వారా రాష్ట్రానికి సంపద పోగవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. మరి వారిది త్యాగం కాదా?' అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి పేరుతో దోపిడీ
ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలంతా అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నారంటూ అచ్చెన్నాయుడు చెబుతున్నారని, ఎవరు ఆమోదించారో ఆయనే చెప్పాలని మంత్రి బొత్స ప్రశ్నించారు. అమరావతి పేరుతో దోపిడీ కార్యక్రమం చేయాలన్నది చంద్రబాబు ఎజెండా అని బొత్స విమర్శలు చేశారు. హైదరాబాద్‌ను డెవలప్ చేశానని చంద్రబాబు ఎప్పుడూ డబ్బా కొట్టుకుంటారని, కేవలం 10 కిలోమీటర్ల మేర ప్రాంతంపైనే దృష్టి పెట్టి, మిగతా 23 జిల్లాలనూ పక్కన పెట్టారని విమర్శించారు. రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్ వే వైఎస్ హయాంలో తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేశారన్నారు. హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.