Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు
Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కనపించిందన్న వార్త కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు చర్యలు ప్రారంబించారు.
![Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు Leopard spotted in Tirumala Ghat Road once again Tirumala News: తిరుమల ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/12/4eec46302de7e7f7753e283d946a13df17234488051041082_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tirumala: శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది.. ఒక చిరుత చిక్కిందని ఊపిరి పీల్చుకునే లోపు... మరో చిరుత కనిపించిందన్న వార్త భక్తులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తాజాగా తిరుమల దారిలో చిరుత సంచరిస్తుందన్న వార్త మరోసారి గుబులు పుట్టిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని 55, 56 మలుపు సమీపంలో ఒక చిరుత రోడ్డు దాటి అడవిలోకి వెళ్లినట్టు భక్తులు గుర్తించి టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు. భక్తుల భద్రత దృష్ట్యా ద్విచక్ర వాహనాల రాకపోకలపై అధికారులు కొన్ని భద్రతా పరమైన చర్యలు తీసుకున్నారు.
సెప్టెంబర్ 24 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహణాలపై వెళ్లే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటివ్ అధికారి, టీటీడీ చెబుతున్నదాని ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వన్యప్రాణులు ఎక్కువగా సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయని తెలిపారు. దీంతో మొదట ఘాట్ రోడ్డులో క్రూర మృగాలు నిత్యం రోడ్డు దాటుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. అందుకే భక్తులతోపాటు వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా మానవ జంతు సంఘర్షణను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ రకమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ద్విచక్ర వాహనాలను రోడ్డుపై అనుమతించబడవని చెప్పారు. భక్తులు ఈ మార్పును గుర్తించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
రెండు నెలల్లో 6 చిరుతలు
గతేడాది ఇదే సమయంలో అటవీ అధికారులు శ్రీవారి మెట్ల మార్గంలో ఆరు చిరుతలను బోనులో బంధించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఈ ఆరు చిరుతలను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకోవడం గమనార్హం. గతేడాది ఆగస్టు 11వ తేదీన లక్షిత అనే ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేయడం కలకలం సృష్టించింది. రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద నడిచి వెళ్తున్న బాలికను తల్లిదండ్రులు చూస్తుండగానే చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. ఉదయాన్నే ఆలయానికి సమీపంలో సగం తినేసిన బాలిక మృతదేహాన్ని ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. అప్పట్నుంచి చిరుతను బంధించేందుకు భద్రతా చర్యలు ముమ్మరం చేసిన అధికారులు ఏకంగా ఆరు చిరుతలను బోనుల బంధించడం విశేషం. సరిగ్గా ఈసారి కూడా ఆగస్టులో మరోసారి చిరుత సంచారంపై వార్తలు రావడంతో అధికారులు ద్విచక్ర వాహనాల రాకపోకలపై రెండు నెలలపాటు నిషేధం విధించారు.
ఆగష్టు 16న ఛత్రస్థాపనోత్సవం
తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఆగస్టు 16న ఛత్రస్థాపనోత్సవం నిర్వహించనున్నారు. అర్చకులు శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు చేపడతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తిరుమల ఏడుకొండల్లోనే అత్యంత ఎత్తయిన నారాయణగిరిపై కలియుగంలో మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ ద్వాదశినాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)