Tirumala Declaration: తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం? జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?
Tirumala News: టీటీడీ లో డిక్లరేషన్ గురించి మీకు తెలుసా.. అసలు అమలులో ఉంది. ఎందుకు తీసుకొచ్చారు. ఎవరు ఇవ్వాలి.. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రముఖులెవరు? జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?
Tirumala News: తిరుమల శ్రీవారి మహాదివ్య క్షేత్రం. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామి వారు కోరిన కోర్కెలు తీర్చే కోదండరాయుడిగా కీర్తిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు అన్యమతస్తులు అయితే వారు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అసలు డిక్లరేషన్ అంటే ఏంటో చూద్దాం..!
తిరుమలను, ఆలయ పవిత్రతను ఎంతో మంది వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. రాజులు, బ్రిటిష్ ప్రభుత్వం, మహంతుల కాలం నుంచి తిరుమల పవిత్రతను... అక్కడ జరగాల్సిన పూజా కార్యక్రమాలను వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహిస్తున్నారు.
పూర్వం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు నేరుగా స్వామి వారిని దర్శించుకొనే వారు. ఇతర దేశాలకు చెందిన వారు రావడంతో వివాదం మొదలైంది. అన్యమతస్తులు రాక తిరుమల పవిత్రతకు విఘాతమంటూ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి పాలకులు, టీటీడీ అధికారులు ఆ వివాదానికి చూపించిన పరిష్కార మార్గమే డిక్లరేషన్ అని ఒక వాదన ఉంది.
డిక్లరేషన్ అంటే?
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్తులు ఎవరైనా స్వామిని దర్శనం చేసుకోవాలంటే ముందుగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. 1810 సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం విస్తరిస్తున్న పరిస్థితుల్లో తిరుమల ఆలయాన్ని నవాబులు పరిపాలన చేసే వారు.. ఆనాటి బ్రిటిష్ పాలకులు డిక్లరేషన్ అనే నిబంధన తీసుకొచ్చారని కూడా చెబుతారు.
దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిబంధనల్లో 136గా దీనిని చేర్చారు. ఈ రూల్ ప్రకారం తాను అన్యమతస్తులైనా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై నమ్మకం, గౌరవం, భక్తి ఉందని.. స్వామి దర్శనానికి అనుమతించాలని కోరుతారు. ఆలయ నిబంధనలు ఏవి అతిక్రమించబోమని పూర్తి వివరాలతో అఫిడవిట్ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ఇది స్వామి వారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సమర్పించాల్సి ఉంటుంది.
తిరుమలేశుడి దర్శనానికి వచ్చిన అన్యమతస్తులు 17వ కంపార్ట్‌మెంటు వద్ద డిక్లరేషన్‌పై సంతకం చేసి ఇస్తారు. అధికారులే వీఐపీల వసతి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడు జగన్‌ని కూడా అధికారులు గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి సంతకాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
డిక్లరేషన్ ఇచ్చిన ప్రముఖులు వీళ్లే
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. సాధారణ భక్తుల్లో అన్యమతస్తులు అని గుర్తించి డిక్లరేషన్ తీసుకోవడం కష్టతరం.. కాని తిరుమలకు వచ్చే ప్రముఖుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం.. అది కూడా టీటీడీ అధికారి వారు ఉన్న గదికి వెళ్లి సంతకం తీసుకొస్తారు. ఎంతో మంది ప్రముఖుల స్వామి వారిపై ఉన్న భక్తి కారణంగా ఎలాంటి మతపరమైన వివాదాలకు తావు లేకుండా డిక్లరేషన్ సమర్పించారు. ఇందులో 2006లో సోనియాగాంధీ వచ్చిన సమయంలో డిక్లరేషన్ సమర్పించక పోవడంతో వివాదం చోటు చేసుకుంది. రాష్ట్రపతిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదా కలిగి ఉన్నా డిక్లరేషన్ సమర్పించారు. ఆ తరువాత గవర్నర్ నరసింహన్ ఈ డిక్లరేషన్ నిబంధనలు మరింత కఠినతరం చేసారు. అప్పటి నుంచి డిక్లరేషన్ చాల మంది ప్రముఖులు సమర్పిస్తున్నారు.
డిక్లరేషన్ సమర్పించని జగన్
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు స్వామి వారి దర్శనం కోసం వచ్చారు. తొలుత ఎంపీ హోదాలో వచ్చినప్పుడు, ఆ తరువైత పార్టీ పెట్టాక వచ్చారు. 2014 నుంచి 2019 వరకు పాదయాత్ర సమయంలో.. ముగిసాక తిరుమలకు వచ్చినప్పుడు ఎప్పుడు డిక్లరేషన్ సమర్పించలేదు. 2019 నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన స్వామి వారి దర్శనం కోసం వచ్చిన ఎప్పుడూ డిక్లరేషన్ సమర్పించలేదు. గతంలో కూడా డిక్లరేషన్ సమర్పించక పోవడంపై వివాదం జరిగింది. అయితే ఈ సారి డిక్లరేషన్ సమర్పించాలని కూటమి నాయకులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. అటు తిరుమల అధికారులు కూడా ఆయన వద్దకు వెళ్లి డిక్లరేషన్‌పై సంతకాలు చేయించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
Also Read: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! అందుకే రియాక్ట్ కావడం లేదా?