TTD News: వీలునామాలో శ్రీవారికి ఆస్తులు రాసిన భక్తుడు - టీటీడీకి హ్యాండోవర్ చేసిన బంధువులు !
Tirumala: శ్రీవారి భక్తుడు ఒకరు తన వీలునామాలో టీటీడీకి ఆస్తులు రాసిచ్చారు. ఆయన చనిపోయాక వీలునామాను చూసిన బంధువుల అందులో ఉన్న మేరకు ఆస్తులు టీటీడీకి స్వాధీనం చేశారు.

Tirumala Sri vari Devotee:తిరుమల శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పిస్తూంటారు. కొంత మంది తమ ఆస్తులు రాసిస్తూంటారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు తాను సంపాదించిన ఆస్తిలో కొంత శ్రీవారికి రాసిచ్చారు. ఈ మేరకు వీలునామాలో పొందు పరిచారు. ఆయన మరణం తర్వాత వీలునామాలో ఉన్న ప్రకారం ఆస్తుల్ని టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశారు.
హైదరాబాద్ కు చెందిన మాజీ ఐఆర్ఎస్ అధికారి వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు తన మరణానంతరం టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు తన బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 లక్షలను విరాళంగా ఇవ్వాలని వీలునామాలో రాశారు. ఆయన చనిపోవడంతో ఆ వీలునామాను బహిర్గతం చేశారు. ఆ సమయంలో యీ విషయం బయటపడింది. వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు హైదరాబాద్‌లోని తన నివాస గృహాన్ని టీటీడీకి రాసిచ్చారు. దీని విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేశారు. అలాగే ఆయన తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.66 లక్షలను కూడా టీటీడీకి విరాళంగా అందించారు. ఈ నగదు టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, ఇతర సేవా ట్రస్టుల కోసం వినియోగిస్తారు.
భాస్కర్ రావు భారత రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్)లో అధికారిగా పనిచేశారు. ఆయన వృత్తిపరమైన జీవితంలో నిజాయతీ తో సేవలు అందించారు. ఆయన తన జీవితాంతం శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉన్నారు. తన ఆస్తిని, నగదును టీటీడీకి విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం ఆయన ఆధ్యాత్మిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని భక్తులు బావిస్తున్నారు. భాస్కర్ రావు మరణానంతరం, ఆయన వీలునామా ప్రకారం ఈ ఆస్తి , నగదు టీటీడీకి బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో ఆయన కుటుంబ సభ్యులు , దా చట్టపరమైన ప్రతినిధులు టీటీడీ అధికారులకు ఈ విరాళాన్ని అందజేశారు.
టీటీడీ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది, ఇందులో ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ (భక్తులకు ఉచిత భోజనం), ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ (వైద్య సహాయం), ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ (గో సంరక్షణ), ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ (విద్య, సామాజిక సేవలు) వంటివి ఉన్నాయి. వీటికి టీటీడీకి భక్తుల నుంచి భారీ విరాళాలు అందుతుంటాయి. 2024 నవంబర్‌లో చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ రూ.2.02 కోట్లు, 2025 జనవరిలో రూ.6 కోట్లు విరాళంగా అందించారు. కార్పొరేట్ సంస్థలు కూడా కోట్ల రూపాయలు వివిధట్రస్టులకు విరాళం అందిస్తూంటాయి.




















