Tirumala Updates: తిరుమల భక్తుల భద్రత కోసం టీటీడీ కీలక నిర్ణయం! బీమా సౌకర్యం, EV బస్సుల ప్రవేశం!
Tirumala Updates: తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై టీటీడీ కసరత్తు చేస్తోంది. బీమా సంస్థలతో చర్చలు జరుపుతోంది.

Tirumala Updates: తిరుమల శ్రీనివాసుడని రోజుకు వేల మంది దర్శించుకుంటారు. ఇలా వస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా భారీగా భక్తులు తరలి వస్తున్న టైంలో వివిధ ప్రమాదాలు జరుగుతున్నాయి. తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాలు, జంతువుల దాడి, అనారోగ్య కారణాలు ఇలా చాలా ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ ప్రయత్నిస్తోంది.
తిరుమలేశుడి దర్శనం కోసం రోజుకు 70వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తుంటారు. వీరి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సౌకర్యాలు కల్పిస్తుంది. కొండపైకి చేరినప్పటి నుంచి మళ్లీ దర్శనం చేసుకొని తిరిగి వెళ్లే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతోంది. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కొన్నింటిని నియంత్రించలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. అందుకే అలాంటి దుర్ఘటనలు జరిగి భక్తులు మరణిస్తే వారికి మూడు లక్షల వరకు పరిహారం ఇస్తున్నారు. దీనికి బదులు మరిన్ని సౌకర్యాలతో బీమా ఫెసిలిటీ కల్పిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది టీటీడీ.
అలిపిరిలో భక్తులు మొదలైనప్పటి నుంచి స్వామిని దర్శించుకొని మళ్లీ తిరిగి అలిపిరి చేరుకునే వరకు బీమా వెసులుబాటు కల్పించాలని చూస్తోంది టీటీడీ. టికెట్లు తీసుకున్నప్పుడే ఈ బీమా ఆయా భక్తుల పేరున వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. సర్వదర్శనం టికెట్లు తీసుకున్న వారిని ఏం చేయాలనే ఆలోచన చేస్తోంది. దీనిపై బీమా సంస్థలతో మాట్లాడుతున్నట్టు సమాచారం.
మోరవైపు తిరుమలను పూర్తిగా కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇకపై పూర్తిగా ఈవీలనే నడపాలని నిర్ణయించారు. తిరుమలలో దాదాపు 50కిపైగా ఎలక్ట్రిక్ బస్‌లు తిరుగుతున్నాయి. మరో 350 బస్‌లు అందుబాటులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. వీటిని విడతల వారీగా ప్రవేశపెట్టనున్నారు. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం 750 ఈవీలను కేటాయించింది. వాటిలో 50 బస్‌లను ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. ఇవి కాకుండా మరో 300 మంజూరు చేయాలని కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడున్న బస్‌లు, భవిష్యత్‌లో వచ్చే 300 బస్‌ల కోసం ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటుకు స్థలం పరిశీలిస్తున్నారు. అన్ని బస్‌లకు కలిపి ఒక చోట డిపో ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఇంతలో మంగళం డిపోలో ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు.





















