CM Jagan: ఆ మహిళలు, యువతులపై రేప్‌లు చేసింది వాళ్లే, ఆ మీడియా దాచిపెడుతోంది: సీఎం జగన్ వ్యాఖ్యలు
CM Jagan: జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను మీట నొక్కి విడుదల చేశారు.
ప్రభుత్వం మంచి చేస్తుంటే దుష్టచతుష్టయానికి కడుపు మంటగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. వాళ్లు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఎన్నింటిని అమలు చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు. వాళ్లు ఆలయాలు ధ్వంసం చేస్తే మనం నిర్మించామని అన్నారు. పల్లెల్ని దెబ్బ తీస్తే మనం గడప వద్దకే సుపరిపాలన తీసుకెళ్లామని అన్నారు. ఇవాళ బటన్ నొక్కితే నేరుగా డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లోకి పోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుపతిలో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను మీట నొక్కి విడుదల చేశారు. మొత్తం 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ.709 కోట్ల డబ్బును నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
జగనన్న విద్యా దీవెన పథకం కింద నేడు నిధులు విడుదలవుతాయనే విషయాన్ని సహించలేని టీడీపీ నాయకులు పదో తరగతి పరీక్షల పేపర్లను లీక్ చేశారని సీఎం జగన్ విమర్శించారు. కొద్ది రోజుల క్రితం ప్రశ్నాపత్రాలు లీకవ్వడం కూడా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లోనే జరిగిందని ఆరోపించారు. ఆ నారాయణ అనే వ్యక్తి చంద్రబాబు హాయాంలోనే మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది టీడీపీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ చేయించి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని అన్నారు.
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని గ్యాంగ్ రేప్, గుంటూరు, విశాఖపట్నం అత్యాచార ఘటనల్లో నిందితులు అందరూ టీడీపీకి చెందిన వారేనని జగన్ సంచలన ఆరోపణ చేశారు. ఆ నిందితుల గురించి చంద్రబాబుకు మద్దతు పలికే మీడియా సంస్థలు రాయబోవని అన్నారు. ఆ ఘటనల్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో మీడియా, ఎల్లో పార్టీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఏడు కొండల వాడిని కోరుకుంటున్నా. దేవుడా.. రక్షించు మా రాష్ట్రాన్ని.. ఈ ఎల్లో మీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి. రెండు నాల్కల సాచి, బుసలు కొట్టే నిర్హేతుక క్రుపా సర్పాల నుంచి, దూర్తుల నుంచి, దుష్టచతుష్టయం నుంచి రక్షించు దేవా.. అని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుతున్నాను.’’ అని సీఎం జగన్ మాట్లాడారు.
బడుల స్థితి మొత్తం మార్చాం
నాడు - నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మర్చామని జగన్ అన్నారు. ప్రభుత్వ బడులు మూసివేద్దామన్న ఆలోచనతోనే గత ప్రభుత్వం ముందుకు వెళ్లిందని విమర్శించారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా తామే చెల్లించినట్లు చెప్పారు. అవినీతికి తావు లేకుండా డబ్బులు నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోనే వేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాడు-నేడు, వసతి దీవెన లాంటి పథకం ఏదైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు.