పదో తరగతి చదివిన మహిళకు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు- తిరుపతిలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. తిరుపతిలో పదోతరగితి ఫెయిల్ అయిన మహిళ ఓటు వేసి మీడియాకు దొరికిపోయారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే కొన్ని రుజువులను కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు నేతలు. ఇప్పుడు అవన్నీ నిజమనేలా తిరుపతిలో ఓ ఘటన జరిగింది. పదో తరగతి ఫెయిల్ అయిన ఓ మహిళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు రావడం కలకలం సృష్టిస్తోంది.
తిరుపతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్లు వెలుగులోకి వస్తున్నారు. 10వ తరగతి ఫెయిలైన మహిళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. డిగ్రీ లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆమెతో మీడియా మాట్లాడితే.. తాను తమిళనాడుకు చెందిన వ్యక్తినని చెప్పుకొచ్చారు. తాను పదోతరగతి ఫెయిల్ అయ్యాయని వివరించారు.
తమిళనాడుకు చెందిన మహిళ తన పేరు విజయ అని చెప్పుకుంటున్నారు. తనకు తమ ప్రాంత వాలంటీర్ వచ్చి ఓటర్ స్లిప్ ఇచ్చారని అందుకే ఓటు వేసేందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. అంతకు మించి తనకు ఏమీ తెలియదని అంటున్నారు. ఆమె దొంగ ఓటు వేసిందని అక్కడే ఉన్న నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్లు లైట్ తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.
తిరుపతిలోని సంజయ్‍గాంధీ కాలనీ 228 పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దొంగ ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్తున్నరాని టీడీపీ నాయకులు ధర్నా చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు టీడీపీ లీడర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సదుంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఇక్కడ పట్టభద్రులు 9036, ఉపాధ్యాయులు 529 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పూతలపట్టు మండల కేంద్రం జడ్పి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నిక నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
తిరుపతిలోని సత్యనారాయణ పురం పోలింగ్ స్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓటు లేకున్నా వైసీపీ నాయకులను పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారంటు ప్రశ్నించినందుకు ఆయన్ని అరెస్టు చేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో పట్టభద్రుల కోసం 51 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 30 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3890 మంది ఓటర్లు హక్కును వినియోగించుకోనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 44432 మంది ఓటర్లు ఓటు వేస్తారు. జిల్లాలో 51 గ్రాడ్యుయేట్, 30 టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కడప జిల్లాలో పట్టభద్రుల కోసం 98 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 38 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7461 మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81317 మంది ఓటు వినియోగించుకొనున్నారు. 93 గ్రాడ్యుయేట్, 38 టీచర్స్ పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 27 మంది ఇన్ప్‌పెక్టర్లు, 73 మంది ఎస్‌ఐలు, 1200 మందికిపైగా పోలీసులను బందోబస్తులో ఉన్నారు.
గాంధీ నగర్ పొలింగ్ స్టేషన్‌లో 22వ బూతులో వైసిపి టిడిపి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ బూత్‌లో వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారంటూ టిడిపి ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. వారిని బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించి ఇరువురిని బయటకు పంపించేశారు.