Chittoor News: అభ్యర్థుల వద్ద ప్రభుత్వ ఉద్యోగులు! వీరంతా అక్కడ ఏం చేస్తున్నట్టు?
Telugu News: చిత్తూరు జిల్లాలో కొందరు అభ్యర్థులు ప్రభుత్వ అధికారులపై పెడుతున్న ఒత్తిడి వారి పాలిట శాపంగా మారింది. ఎన్నికలు అంతా ముగిశాక తమ పరిస్థితి ఏంటని కొందరు అధికారులు కంగారు పడుతున్నారు.
AP Elections 2024: రాష్ట్రంలో ఎన్నికలు వేడి ప్రారంభమైంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు వారి స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగులు ప్రచారంలో పాల్గొని సస్పెండ్ అవుతున్నారు. రాజకీయం అనేది ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాదు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే వారి పై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
నిబంధనలు తెలిసి చేస్తున్నారు..
ఎన్నికల నియమావళి తెలిసి కొందరు నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఓ పార్టీ కి పని చేస్తున్నారు. పార్టీ ప్రచారం తో పాటు వారి పనులు వీరే భుజాన వేసుకుని చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ ప్రచారం, వారి సమాచారం గ్రూప్ లో పంపి ఇలా విచారణ ఎదుర్కొంటున్న వారు కొందరైతే.. సస్పెండ్ గురై ఇంట్లో ఉన్న వారు మరికొందరు. తెలిసి చేస్తున్న వారితో పాటు తెలియక జరిగి ఇబ్బందులు పడుతున్నారు వారు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు వారి అవసరం కోసం ప్రభుత్వ ఉద్యోగులను వాడుకుంటుంటే.. పదవులు వచ్చాక మీకు ఏం కాకుండా చేస్తామని హామీలు ఇచ్చిన వారు ఉన్నారు. పదవి రాకపోతే వారి పరిస్థితి ఏంటనేది గుర్తించడం లేదు ఉద్యోగులు.
క్షుణ్ణంగా విచారణ..
ప్రభుత్వ ఉద్యోగి, అనుబంధ శాఖల ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కార్యక్రమాలలో ఉన్న, సామాజిక మాధ్యమాలతో పాటు వ్యక్తి గతంగా ప్రచారం చేసిన అందుకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల కమిషన్ లేదా ఆయా జిల్లాల డీఈవో ( జిల్లా ఎన్నికల అధికారి) నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ దీనిపై విచారణ చేస్తుంది. సాక్షాదారాలు పరిశీలించిన తరువాత అది నిజమైతే జిల్లా ఎన్నికల అధికారికి లేదా స్థానిక ఆర్వో కు నివేదిక ఇస్తారు.
ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వచ్చే నాయకులు ఉద్యోగి ఇంటికి వచ్చి మాట్లాడిన, ప్రచారం చేసిన గిట్టని వారు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విచారణ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో విచారణ అనంతరం చర్యలు తీసుకుంటారు. ఉద్యోగి నుంచి సైతం వివరణ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే చాలా విభాగాల ఉద్యోగులు సస్పెండ్ కు గురైయ్యారు. అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఉద్యోగులే బలవ్వక తప్పదని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు.
అభ్యర్థుల ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థుల ఇంట్లోని వారు ప్రభుత్వ, అనుబంధ శాఖల ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం వారు ప్రచారం చేయలేకపోతున్న... వారి వర్గాలకు సంబంధించిన రహస్యంగా సమావేశాలు, విందు పార్టీలు ఇస్తున్నారు. ఇలాంటి వాటిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.