Veera Simha Reddy: ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది - వీరసింహా రెడ్డి చూసిన తరువాత బాలకృష్ణ ఏమన్నారంటే
Balakrishna Watched Veera Simha Reddy Movie: ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని, సామాన్య పౌరుడిగా చెబుతున్నానని.. రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవు అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
Balakrishna Watched Veera Simha Reddy Movie: ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని, సామాన్య పౌరుడిగా చెబుతున్నానని.. రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవు అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సంక్రాంతి వేడుకలను నారావారిపల్లెలో జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణ.. చంద్రగిరిలోని ఎస్ వి సినిమా కాంప్లెక్స్ లో తాను నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహా రెడ్డి ని కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. వీరసింహా రెడ్డి మూవీ సూపర్ హిట్ కావడంపై బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు.
చంద్రగిరి ఎస్వీ థియేటర్ లో వీరసింహా రెడ్డి సినిమా చూసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని, పరిస్థితులు బాగా లేవు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల మూడేళ్ళు నారావారిపల్లెకి రాలేకపోయాం అని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి అన్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన తన సినిమా వీరసింహా రెడ్డి భారీ విజయం సాధించింది. వీరసింహా రెడ్డి సినిమాను ఆదరించిన ప్రేక్షకుల మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు బాలకృష్ణ. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'వీర సింహా రెడ్డి' సినిమా 54 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇది. షేర్ చూస్తే... 30 కోట్లకు అటు ఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వీర సింహారెడ్డి సినిమా చూసిన ఏపీ ప్రభుత్వ అధికారులు- ప్రభుత్వానికి నివేదిక!
వీర సింహారెడ్డి సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్‌పై చర్చ నడుస్తోంది. సినిమాలో ఉన్న డైలాగులు పూర్తిగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉన్నాయనే అభిప్రాయం సినిమా రిలీజ్‌కు ముందు నుండే వ్యక్తం అయ్యాయి. ఇక చిత్రం రిలీజ్ అయిన తరవాత అసలు విషయం కూడా తెలిసింది. ఇంతకీ ఆ డైలాగులు ఎందుకు పేల్చారనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సెక్టార్లలో హాట్ టాపిక్ అయింది. అంతే కాదు ప్రభుత్వం కూడా బాలయ్య చిత్రంలోని డైలాగులపై ఆరా తీసిందని సమాచారం. ప్రత్యేకంగా అధికారుల టీంను కూడా పంపి డైలాగుల చిట్టా రాసుకురమ్మన్నారనే టాక్ నడుస్తుంది. బాలయ్య తన సినిమాల్లో ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో విమర్శించారా, డైలాగులతో వైసీపీని అంతగా ఇరకాటంలోకి నెట్టారా అనే చర్చ తెర మీదకు వచ్చింది.
పాలించటం అభివృద్ధి... ప్రజలను వేధించడం కాదు. జీతాలు ఇవ్వటం అభివృద్ధి ..బిచ్చం వేయటం కాదు. పని చేయటం అభివృద్ధి, పనులు ఆపటం కాదు. నిర్మించటం అభివృద్ధి. కూల్చటం కాదు. పరిశ్రమలు తీసుకురావటం అభివృద్ధి ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టటం కాదు. బుద్ది తెచ్చుకో. అభివృద్ధి అర్దం తెలుసుకో. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా అంటూ మాటలు తూటాల్లా పేలాయి. ఇలాంటి డైలాగులు చాలా సినిమాలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడ కేంద్రంగా కొందరు అధికారులు సినిమాను వీక్షించారని చెబుతున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేఖంగా డైలాగులు ఉన్నాయని నిర్దారణకు వచ్చారని దీన్ని ఓ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించారని అంటున్నారు. ఈ ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ఫస్ట్ షో ప్రదర్శిస్తుండగానే చాలా మంది ఫోన్ లలో డైలాగులు రికార్డు చేసి, బయటకు వదిలారు. దీంతో అవి చాలా ఫాస్ట్‌గా వైరల్ అయ్యాయి. దీంతో అలాంటి డైలాగులు ఎందుకు వాడాల్సి వచ్చింది, కథలో భాగంగా వచ్చినవేనా లేకపోతే, టార్గెట్‌గానే వ్యవహరించారా అనే సందేహాలు పొలిటికల్ సెక్టార్‌లో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి.