Tirupati: పేరూరు చెరువుకు గండితో పాతకాల్వ గ్రామస్తుల ఆందోళన... ఎమ్మెల్యే కావాలనే చేశారని బాధితులు ఆగ్రహం..!
పేరూరు చెరువుకు గండికొట్టి పాతకాల్వ, సి.గొల్లపల్లి, రామానుజం కాలనీ మీదుగా వరద నీరు తరలింపు ఉద్రిక్తతకు దారితీసింది. తమ గ్రామాల్లో వరద నీరు వస్తుందని గ్రామస్తుల చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.
తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పేరూరు చెరువుకు అధికారులు గండికొట్టి పాతకాల్వ, సి.గొల్లపల్లి, రామానుజం కాలనీ మీదుగా స్వర్ణముఖి నది వైపు వరద నీటిని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పాతకాల్వ గ్రామంలోకి వరద నీరు వచ్చిందని హైవేపై గురువారం అర్ధరాత్రి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసిన ఘటనలో ఓ మహిళతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామం వైపు వరద నీరు మళ్లించమని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.
Also Read: మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్
ఎమ్మెల్యేనే ఇలా చేశారని గ్రామస్తుల ఆవేదన
కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం తమ గ్రామం వైపు వరద నీరు పంపించి గ్రామం మునిగే విధంగా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి వరద నీరు రావడంతో ఇళ్లల్లోని వంట సామగ్రి అన్ని తడిచి పోవడంతో రాత్రి అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిండి తిప్పలు లేకుండా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు అంటున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలగుంటకు, పేరూరుకి వరద నీరు వెళ్లకుండా తమ గ్రామాలపై వచ్చేలా చేశారని గ్రామస్తులు వాపోతున్నారు.
Also Read: అమరావతి మహిళా రైతులకు చీర, సారె.. కోవూరు ప్రజల ఆత్మీయత !
కాల్వల ఆక్రమణలతో ముంపు
తిరుపతి కార్పొరేషన్‌లో ప్రధానంగా నాలుగు పెద్ద కాల్వలు ఉన్నాయి. శేషాచలం కొండలపై నుంచి వచ్చే వర్షపు నీరు కపిలతీర్థం, ఎస్వీ, వెటర్నరీ వర్సిటీలు, వ్యవసాయ కళాశాల మీదుగా వెళ్లే కాల్వల ద్వారా పేరూరు, తుమ్ములగుంట, అవిలాల చెరువుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి ఓటేరు చెరువుకు అక్కడ నుంచి యోగిమల్లవరం మీదుగా స్వర్ణముఖి నదిలోకి నీరు చేరుతుంది. ఎస్వీ యూనివర్శిటీ, పద్మావతి కళాశాల మీదుగా వర్షపు నీరు మజ్జిగ కాలువ నుంచి స్వర్ణముఖి నదికి చేరుతుంది. మాల్వాడీ గుండం నుంచి ప్రవహించే వర్షపు నీరు ఎన్‌జీఓ కాలనీ, రైల్వే కాలనీ, అశోక్ నగర్, కొర్లగుంట మీదుగా వినాయక సాగర్ చెరువు, చింతలచేను, కరకంబాడి మీదుగా దిగువకు ప్రవహించేది. అన్నమయ్య కూడలి, పళణి థియేటర్ నుంచి వచ్చే వర్షపు నీరు లక్ష్మీపురం, శ్రీనివాసపురం, పద్మావతిపురం నుంచి కొరమేనుగుంట, దామినేడు చెరువుకు చేరాలి. అది నిండగానే స్వర్ణముఖి నదిలోకి నీరు చేరుతుంది. ఈ కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో తిరుపతి నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి.
Also Read: నాడు సందుల్లో తిరిగి ముద్దులు పెట్టారు..నేడు కంటికి కనిపించడం లేదు .. జగన్‌పై జనసేన సెటైర్లు !