Chittoor News : శ్రీకాళహస్తిలో పోలీసులపై జనసైనికుల రాళ్ల దాడి - అసలేం జరిగిందంటే ?
జనసేన నేత దీక్ష భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో జనసైనికులు రాళ్ల దాడి చేశారు.
Vinutha Kotaa: శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినూత కోటా చేపట్టిన దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులపై తీవ్ర గాయాలు అయ్యాయి. సీఐతో పాటు ఎస్‌ఐ కు కూడా రాళ్లు బలంగా తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆ్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున పోలీసులు కోటా వినూత దీక్ష శిబిరం వద్ద మోహించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గత మూడు రోజులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినూత కోటా తన భర్త తో కలిసి ఆమరణ దీక్ష చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామం లో రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న లాంకో/ఈసీఎల్ సంస్థ కాంపౌండ్ వాల్ ను వ్యతిరేకిస్తూ ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. గోడ నిర్మిస్తే ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని గత వారం రోజులుగా చిందేపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
గ్రామస్తులకు అండగా నిలబడ్డ జనసేన నాయకులు ఈసీఎల్ పరిశ్రమ వద్ద తమ మద్దతుదారులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న వినూత , ఆమె భర్త ఆరోగ్య పరిస్థితి దిగజారుతూండటంతో ... వైద్యులు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. వినూత దంపతులకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని రాతపూర్వకంగా వినూతకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే వినూత ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. దీక్ష ప్రారంభించారు.
కోట వినూత దీక్షపై జనసేన పార్టీ కూడా స్పందించింది. చిందేపల్లి రోడ్డును ఓ కార్పొరేట్ కంపెనీ మూసేసి ప్రజలకు ప్రవేశం లేదని హుకుం జారీ చేస్తే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చేస్తోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రహదారిని మూయవద్దన్న తమ పార్టీ నాయకులు, గ్రామస్తులపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించారు.