(Source: ECI/ABP News/ABP Majha)
TDP News : ఐయామ్ విత్ బాబు నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం - బెంగళూరులో భారీ ప్రదర్శన !
ఐయామ్ బాబు పేరుతో నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో కట్టడి చేస్తున్నారు.
TDP News : స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రదర్శనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో గురువారమే ఆంక్షలు విధించారు. శక్రవారం కూడా నిరసనలు ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపించడంతో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. సాఫ్ట్ వేర్ సంస్థల హెచ్‌ఆర్‌ల నుంచి పెద్ద ఎత్తున ఈమెయిల్స్ పంపించారు. మణికొండలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
నిరసనలు జరగకుండా హైదరాబాద్ పోలీసుల కట్టడి
శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో మరింత పెరుగుతాయన్న ఉద్దేశంతో పోలీసులతో నోటీసులు ఇప్పించారు. హెచ్ ఆర్ లకూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులు ఎలాంటి సంఘిభావ ప్రదర్శనలు జరగకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నారు. ఈ నిరసలేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రదర్శనలు కాదు. అయినా అనుమతులు లేకపోవడంతో పోలీసులు కట్టడి చేస్తున్నారు.
బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన
మరో వైపు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరు టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన నరిసన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువకులు తరలి వచ్చారు. టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు తరలి వచ్చారు. అయితే పోలీసులు ఎవరికీ ఆంక్షలు పెట్టలేదు. సాఫీగా కార్యక్రమం సాగిపోయింది.
విజయవాడ ఇంజనీరింగ్ కాలేజీలకు మధ్యాహ్నం నుంచి సెలవులు
అదే సమయమంలో విజయవాడలో అయితే పూర్తి స్థాయి నిర్బంధం నిర్వహించారు. విజయవాడ ఇంజినీరింగ్ కాలేజీలకు పోలీసులు మధ్యాహ్నం నుంచి సెలవులు ప్రకటించారు. ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు నిరసనలకు ప్లాన్ చేస్తున్నారని తెలియగానే.. హడావుడిగా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. కాలేజీలను ఉన్న పళంగా మూయించేసి ఇంటికి పంపించారు. ఎవరైనా నిరసన ప్రదర్శనలు చేపడితే ఊరుకునేది లేదన్నారు.
సడెన్ ధర్నాలకు ప్లాన్ చేస్తున్న టీడీపీ
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఎవరైనా ప్రదర్శన నిర్వహిస్తే అణిచివేస్తున్నారు. అక్రమ కేసులో అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేయాలని.. ప్రతీ రోజూ అనేక చోట్ల సడెన్ ధర్నాలు జరుగుతున్నాయి.