Andhra No New Cabinet : ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?
మంత్రివర్గాన్ని మార్చే విషయంలో సీఎం జగన్ పునరాలోచన చేస్తున్నారు. కొత్త మంత్రుల జాబితా సిద్ధమైనప్పటికీ వివిధ కారణాల రీత్యా ప్రస్తుతకేబినెట్‌నే కొనసాగించాలని నిర్ణయించకున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టైల్ వేరు. ఆయన ఏదైనా అనుకుంటే ఇట్టే చేసేస్తారు. ఓ సారి నిర్ణయం తీసుకుంటే తప్పని సరి అయితే తప్ప వెనుదిగిరి చూడరు. అందుకే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు 90 శాతం మంత్రులకు రెండున్నరేళ్ల పాటు మాత్రమే పదవి కాలం అని తేల్చేశారు. ఆ ప్రకారం వారు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. నిన్నామొన్నటి వరకూ సీఎం జగన్ కూడా మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో మార్చాలనే అనుకున్నారు. కసరత్తు కూడా పూర్తి చేశారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు కేబినెట్‌నే మరికొన్నాళ్లు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీలోని ఉన్నత స్థాయి నేతలకు స్పష్టమైన సమాచారం అందింది. దీంతో వైఎస్ జగన్ నిర్ణయంపై అధికార పార్టీలో కూడా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Also Read : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !
నిన్నామొన్నటి వరకూ వంద శాతం మంత్రుల్ని మార్చే యోచనలో సీఎం జగన్ !
రెండు నెలల కిందట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి వంద శాతం మంత్రుల్ని మార్చేయబోతున్నారని దానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అప్పుడే కొత్త మంత్రులెవరు అన్న చర్చ ప్రారంభమయింది. సీనియర్లకు పార్టీ బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం జరిగింది. అంతర్గతంగా వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలున్న వారు కూడా కేబినెట్ ప్రక్షాళనకు కసరత్తు జరుగుతోందని తేల్చారు. ఆ కసరత్తు పూర్తయింది. కానీ ఇప్పుడల్లా మంత్రివర్గాన్ని మార్చడం మంచిది కాదని జగన్ నిర్ణయానికి వచ్చారు.
మార్చిలో ఎడెనిమిది మంది మంత్రుల్ని మార్చే అవకాశం !
అయితే ఇప్పుడున్న కొంత మంది మంత్రులు వివాదాస్పదులయ్యారు. వారితో వచ్చే మార్చికి రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జగనున్నాయి. ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఎడెనిమిది మందిని మాత్రం మార్చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చిలో బడ్జెట్ సమావేశాల తర్వాత ఎడెనిమిది మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకుని ఆ వరకే భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కరోనా కారణంగా మంత్రులుగా పూర్తి స్థాయిలో పని చేయలేకపోవడం.. కొత్తగా వచ్చే మంత్రులు శాఖలపై పట్టు సాధించకపోతే ఎన్నికల్లో ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉంటాయని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ భావిస్తోంది.
Also Read : ఫిట్‌మెంట్ ఖరారు .. విధివిధానాలూ ఫైనల్ ! ఏపీ ఉద్యోగులకు జీతం ఎంత పెరగబోతోందో తెలుసా ?
రాజ్యసభకు ఓ సీనియర్ మంత్రి !
ఓ సీనియర్ మంత్రిని రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపుతారని అనుకున్నా.. చివరికి ఒకరిని మాత్రమే పంపాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆయనెవరన్నదానిపై వైఎస్ఆర్‌సీపీ వర్గాలకు క్లారిటీ ఉంది. ఇప్పటికి అయితే వచ్చే మార్చిలో ఎడెనిమిది మంత్రులను మాత్రమే మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారని.. ఒక వేళ మనసు మార్చుకుంటే రేపే కొత్త కేబినెట్ ఏర్పడవచ్చని .. జగన్ నిర్ణయాలు తీసుకునే వేగం తెలిసిన కొంత మంది వైఎస్ఆర్‌సీపీ ముఖ్యులంటున్నారు. ఇప్పటికి మాత్రం మంత్రులందరికీ ఎక్స్‌టెన్షన్ లభించినట్లేనని చెబుతున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి