Twitter AP Highcourt : భారతచట్టాలు, కోర్టుల్ని గౌరవించకపోతే మూసుకోవాల్సిందే.. ట్విట్టర్‌కు ఏపీ హైకోర్టు హెచ్చరిక !
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని ట్విట్టర్‌ను ఏపీ హైకోర్టు హెచ్చరించింది. న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుల్లో ట్విట్టర్ సహకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ట్విట్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ విచారణకు ట్విట్టర్ సహకరించకపోవడంపై మండిపడింది. భారతదేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ట్విటర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. వారం లోపు కౌంటర్ ఫైల్ చేయాలని మైక్రో బ్లాగింగ్ సైట్‌ను ధర్మాసనం ఆదేశించింది.Also Read: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 8 నుంచి 8.5 శాతం వృద్ధి రేటు.. ఆర్థిక సర్వేలో ఏముందంటే..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయన్న కారణంగా గత ఏడాది సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులు, వ్యాయవ్యవస్థను నిందిస్తూ వందల కొద్దీ పోస్టులు పెట్టారు. ఈ అంశం వివాదాస్పదమయింది. హత్య చేస్తామనే బెదిరంపులతో పాటు న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బకొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆదేశించినా సోషల్ మీడియా సైట్లలో న్యాయమూర్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలు, పోస్టులు తొలగించలేదు.
Also Read: బడ్జెట్‌పై ఎన్నికల ప్రభావం నిజమే..! ప్రతిపక్షాలకు మోదీ ఏం పిలుపునిచ్చారంటే!!
కొన్ని సంస్థలు తొలగించామని చెబుతున్నప్పటికీ అది అబద్దమేనని.. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినప్పటికీ.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే వస్తున్నాయని హైకోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ధర్మాసనం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియల్‌ను పోలీసులను పంపి స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు ఇస్తామని హెచ్చరించింది. గతంలో యూట్యూబ్ పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో లింకులు తొలగించామని హైకోర్టుకు చెప్పినా అదంతా అవాస్తవమేనని వీడియోలు ఇంకా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.
మరో వైపు సీబీఐ విచారణ తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని మరోసారి సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. గతంలో పలు మార్లు విచారణ జరిగినా సీబీఐ అధికారులు చెప్పిందే చెబుతున్నారు తప్ప ఎవర్నీ అరెస్ట్ చేయడం లేదు. సోషల్ మీడియా సైట్లు కూడా హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.