TDP Janasena : ఏపీ రాజకీయ సమీకరణాల్ని మార్చనున్న టీడీపీ, జనసేన కూటమి - ఇప్పటి నుండి మరో లెక్క !
ఏపీ రాజకీయ సమీకరణాల్ని టీడీపీ, జనసేన కూటమి మార్చనుంది. ఇప్పటి వరకూ ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా రాజకీయాలు మారే అవకాశాలు ఉన్నాయి.
TDP Janasena : సంక్షోభంలో అవకాశాలను వెదుక్కుంటానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతూ ఉంటారు. ఇప్పుడు జనసేనతో పొత్తు ఖరారు విషయంలో చంద్రబాబు వ్యూహం చూస్తే అది నిజమేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయనను రిమాండ్‌కు పంపారు. అదే సమయంలో అసలు డబ్బులు దుర్వినియోగం అయ్యాయని కానీ.. అవి చంద్రబాబుకు వచ్చాయని చిన్న ఆధారం కూడా లేదని టీడీపీ గట్టి వాదన వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో చంద్రబాబుకు మద్దతు లభించింది. రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని దాదాపుగా ఏకాభిప్రాయంతో నేతలు ఖండించారు. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్.. రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ అయి పొత్తులను ప్రకటించడం సంచలనంగా మారింది.
సరైన టైమింగ్
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా లేదా అన్న సందిగ్ధం కొంత కాలం నుంచి ఉంది. చంద్రబాబు, పవన్ ఇద్దరూ రెండు, మూడు సార్లు సమావేశం అయ్యారు కానీ స్పష్టత రాలేదు. పొత్తుల ప్రకటనకు ఓ గట్టి సందర్భం అవసరం వచ్చింది. అది చంద్రబాబు అరెస్ట్ కన్నా గొప్ప టైమింగ్ ఉండదని డిసైడయ్యారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ కు ప్రభుత్వం రెండు వారాల సమయం కావాలని అడగడం.. ఒక్క వారం హైకోర్టు గడువు ఇవ్వడంతో చురుగ్గా స్పందించారు. ములాఖత్ తర్వాత పొత్తుల ప్రకటన చేయాలని డిసైడయ్యారు. ఆ మేరకు అనుకున్న టెంపోను కొనసాగిస్తూ పొత్తుల ప్రకటన చేశఆరు.
రాష్ట్రం కోసం నిర్ణయం
పవన్ కళ్యాణ్ సినిమాల్లో చెప్పిన ఈ డైలాగు పొలిటికల్ లైఫ్ లో కూడా వర్కవుట్ అవుతుందా. ఈ రోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో రాజమండ్రిలో జైల్ లో ములాఖత్ తర్వాత జనసేన కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పొత్తులపై ప్రకటన చేశారు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడిని అలా జైల్లో పెట్టడం కేవలం వైసీపీ కక్ష సాధింపుకు నిదర్శనమంటూనే ఇన్నాళ్లుగా మనసులో ఉన్న మాటను బయటకు చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ నిర్ణయం కేవలం జనసేన, టీడీపీ భవిష్యత్తు కోసం కాకుండా రాష్ట్రం భవిష్యత్తు కోసం అని పవన్ చెబుతున్నారు.
ఏపీలో మారిపోనున్న రాజకీయ సమీకరణాలు
టీడీపీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన నలభై ఐదేళ్ల పొలిటకల్ కెరీర్ లో ఎన్నడూ ఎదుర్కోని ఇబ్బందుల్లో ప్రస్తుతం ఉన్నారు. మరో వైపు ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ విజయవంతంగా నడుస్తున్న యువగళాన్ని అర్థాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇలాంటి టైమ్ లో పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఓ బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేసి..రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా పని చేయనుందా. లేదా సినిమా డైలాగులకు సంబంధం లేని పొలిటికల్ కెరీర్ లో ఈ నిర్ణయం అలజడి రేపనుందా..వేచి చూడాల్సిందే.