Breaking News: తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన నాగేశ్వరరావు (44), జయరావ్ (42), మల్లికార్జున్ (40)గా ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ
అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబందించిన ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ. 8లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వాళ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఎంఆర్ఓ ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారని, ధ్రువపత్రం తప్పని తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీ కాని సీట్లను తదుపరి ఏడాదికి బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు.
తెలంగాణ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా అనిల్ కుమార్
తెలంగాణ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అధికారి అనిల్ కుమార్ నియమితులయ్యారు. ఏడీజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న టీ.ప్రభాకర్ రావు బదిలీ అయ్యారు.
సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. డిసెంబర్‌లో మరో 15 రోజులు సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నారు. కరోనా వల్ల గతేడాది ఒక్కరోజే బడ్జెట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అరెస్టు!
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రిని కస్టడీలోకి తీసుకున్నట్టు పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అరెస్టు ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలో భూకంపం...ఏపీలో స్వల్ప ప్రకంపనలు!
బంగాళాఖాతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.1గా నమోదు అయ్యింది. దీంతో ఏపీలోని పలు తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.