Chandrababu Naidu Arrest: పార్లమెంట్ ఎదుట టీడీపీ లీడర్ల ధర్నా- ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని నినాదాలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీ, మాజీ ఎంపీలు నిరసన తెలిపారు
Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీడీపీ ఎంపీలు జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుర్తించారు.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ' సేవ్ ఆంధ్ర ప్రదేశ్', ' వి వాంట్ జస్టిస్ ' అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జగన్ ప్రభుత్వానికి తగదని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్న గజదొంగ జగన్ అని విమర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఆరోపించారు. ఎవరికి అన్యాయం చేయని చంద్రబాబును అక్రమ అరెస్టు చేయడం సరికాదని ఆరోపించారు. దినంతటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తప్పు చేసిన వారు బయట తిరుగుతూ ఉంటే తప్పున చేయనివారు జైలు లోపల ఉండటం దుర్మార్గపు పాలనకు నిదర్శనమని ఎంపీలు వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో నెంబర్ వన్ అవినీతిపరుడు ఎవరంటే జగన్ ను అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన వల్ల రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని ఆరోపించారు. ప్రశ్నించే తత్వం ఉన్న యువతను దెబ్బతీస్తే తన అధికారానికి అడ్డు ఉండదని కుట్రతో లేని స్కిల్ డెవలప్మెంట్ స్కాం సృష్టించి క్రిమినల్ బుద్ధితో టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం జగన్ ఇరికించారని ఆరోపించారు.
టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా మాట్లాడారు. ' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఆధారాలు లేకుండా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో ఉంచారు. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనించడానికి సాధ్యమైన ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం' అని ఎంపీ జయదేవ్ మాట్లాడారు.
ఏపీలో అరాచక, అణచివేత పాలన...
రాష్ట్రంలో అరాచక, అణిచివేత పాలన సాగుతోందని టీడీపీ ఎంపీలు విమర్శించారు. అర్ధరాత్రి అరెస్టు చేయడం జగన్ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం అన్నారు. హత్య కేసులో ముద్దాయి అయినా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పిన పోలీసులకు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఆ సమస్య గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. స్వచ్ఛందంగా, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని ఎంపీలు ఆరోపించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఎంపీలు కోరారు. జగన్ నాలుగేళ్ల పాలనలో ఇలాంటి అభివృద్ధి కనబడలేదని, రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పార్లమెంట్లో చర్చ లేవనెత్తుతామని ఎంపీలు వెల్లడించారు.