Rammohan Naidu: కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ
Rammohan Naidu: మోడీ మంత్రి వర్గంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చోటు దక్కించుకున్నారు. దీంతో ఆయన తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన శ్రీకాకుళం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
Rammohan said Thanks to Srikakulam People : ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. మిత్రపక్షాల మద్దతుతో ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమానికి ఇప్పటికే పలు దేశాధినేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు మన దేశంలోని రాజకీయ రంగ ప్రముఖులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, గవర్నర్లకు మోడీ ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఎన్డీయే కూటమిలో కీలకంగా మారిన టీడీపీకి కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది. టీడీపీకి మూడు కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ పేర్లు కేంద్ర మంత్రుల పదవులకు ఖరారయ్యాయి.
శ్రీకాకుళం ప్రజలకు వీడియో సందేశం
ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. కేంద్రమంత్రి వర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మరికాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న ఆయన ట్విటర్లో వీడియో సందేశం పోస్టు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘ కేంద్ర మంత్రి వర్గంలో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, మరెంతో మందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేడు తలుచుకోవాల్సిన వ్యక్తి నా తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు, ఆయన చనిపోయినప్పటికీ తన ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉన్నాయి. ఆయన ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తోంది. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి నాకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తున్న మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, సోదర భావంతో చూస్తున్న లోకేశ్ అన్న, పవన్ కల్యాణ్, నరేంద్రమోడీ, ముఖ్యంగా మా బాబాయి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులు, మా అమ్మ, నా సతీమణి వారంతా ఎన్నో త్యాగాలు చేసి నేను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారు. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మరో కారణం మా శ్రీకాకుళం ప్రజలు. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానం ఎంత వరకు తీసుకుని వచ్చిందో మీరు ప్రత్యేకంగా చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
Thank you everyone for the love and support, all of this will not be possible without you. pic.twitter.com/3XxB4uamaI
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 9, 2024
ఉజ్వలంగా ఏపీ భవిష్యత్
అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, భారతీయ జనతాపార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఎన్డీయే కూటమికి ఒక హిస్టారికల్ విక్టరీ, ల్యాండ్ స్లైడ్ విక్టరీని అందించారు. చారిత్రాత్మక విజయాన్ని రాష్ట్రంలోనూ, దేశంలోనూ అందించారు. దాని కారణంగానే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఈరోజు మనందరికీ చాలా ఉజ్వలంగా కనిపిస్తోంది. నరేంద్రమోడీ, చంద్రబాబు నేతృత్వంలో పనిచేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు లభించిన ఈ మంత్రి పదవి నా ఒక్కడిదే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిది అని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాను.
గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నా వారి కోసం మేం పనిచేస్తూ వచ్చాం. వచ్చే ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో మీకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మీకందరికి న్యాయం చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడతాము. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారు చేయాలనేదే మా అందరి లక్ష్యం’’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.