TDP News: జగన్ బటన్ నొక్కినా, వాళ్ల అకౌంట్లలో డబ్బులు పడటం లేదు: పరిటాల సునీత సెటైర్లు
Paritala Sunitha News: వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అధోగతిపాలైందని.. ప్రస్తుతం ఏపీని ఎవరు కాపాడలేని పరిస్థితి నెలకొందని సీఎం జగన్ పాలనపై పరిటాల సునీత సెటైర్లు వేశారు.
AP Elections 2024: రామగిరి: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అయితేనే ఏపీని కాపాడగలరని.. లేకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) అన్నారు. రామగిరి మండలం నసనకోట పంచాయతీలోని గంగంపల్లి గ్రామంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మినీ మేనిఫెస్టోలోని పథకాల గురించి పరిటాల సునీత వివరించారు.
సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించాలనే వీటిని తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సూపర్ సిక్స్ పథకాలు రూపొందించారని పరిటాల సునీత వారికి వివరించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ప్రతినెల 1500 ఆర్థిక సాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వంటి కార్యక్రమాలు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరుతో అందరికీ సంక్షేమాన్ని అందిస్తామంటూ.. కేవలం కొందరికి పథకాలు అందించారని ఆరోపించారు. కానీ టిడిపి అధికారంలోకి వస్తే అర్హత ప్రామాణికంగా.. ఇంట్లో ఎంతమంది ఉన్నా వారికి ఏ ఏ పథకానికి అర్హులన్నది ముందే వివరిస్తున్నట్లు తెలిపారు. చెప్పిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేరుస్తామని మాట ఇచ్చారు.
జగన్ బటన్ నొక్కినా అకౌంట్లలో డబ్బులు పడటం లేదు
మరోవైపు వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అధోగతిపాలైందని.. ప్రస్తుతం ఏపీని ఎవరు కాపాడలేని పరిస్థితి నెలకొందని సీఎం జగన్ పాలనపై పరిటాల సునీత సెటైర్లు వేశారు. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గతంలో సీఎం జగన్ జిల్లాకు వచ్చిన సమయంలో రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తామని బటన్ నొక్కి వెళ్లారని కానీ ఒకరి అకౌంట్లో కూడా డబ్బు పడలేదన్నారు. ఇప్పుడు కూడా ఆసరా పేరుతో ఉరవకొండలో బటన్ నొక్కి వెళ్లారని మహిళల అకౌంట్ కు డబ్బులు రాలేదని చాలామంది చెబుతున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలాంటి మోసపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రామగిరిలో ఈసారి భారీ మెజార్టీ రావాలని ఇందుకోసం నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని సునీత సూచించారు.