TDP Atchannaidu: ఏపీ రాజధాని హైదరాబాద్, మంత్రి బొత్స కామెంట్స్ పై అచ్చెన్నాయుడు ఫైర్
TDP Atchannaidu:విభజన చట్టం ప్రకారం 2024 వరకూ ఏపీ రాజధాని హైదరాబాదే అన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అక్కడికే వెళ్లిపోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
TDP Atchannaidu: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు(AP Budget Session) సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం(Governor Speech)తో సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నా గవర్నర్ పట్టించుకోవడంలేదని టీడీపీ ఆరోపించింది. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ(TDP) నేతలు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఏపీలో గత మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు(Atchannaidu).. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతున్నా గవర్నర్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతుందన్నారు. న్యాయవ్యవస్థపై దాడి జరిగినా గవర్నర్ స్పందించలేదన్నారు.
బీఏసీలో సీఎం జగన్ ఆగ్రహం
ప్రభుత్వం గవర్నర్ పేరు మీద అప్పులు తీసుకున్నా స్పందించలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ స్పందించలేదన్నారు. సీఆర్డీఏ చట్టం ఎవరింట్లోనో తయారు చేసింది కాదన్న ఆయన గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ప్రసంగాన్ని అడ్డుకున్నామన్నారు. గవర్నర్ ప్రసంగంలో అవాస్తవాలను ప్రజలు గమనించాలన్నారు. బీఏసీలో కూడా ప్రజా సమస్యలకు ప్రభుత్వం విలువ ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో 30 అంశాలను ప్రభుత్వం ముందుంచినా పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించినందుకు బీఏసీ(BAC)లో సీఎం జగన్(CM Jagan) ఆగ్రహించారని అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి బొత్స వ్యాఖ్యలు సరికాదు
ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) చేసిన వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం 2024 వరకూ ఏపీ రాజధాని హైదరాబాదే(Hyderabad) అని మంత్రి బొత్స అన్నారన్న అచ్చెన్నాయుడు అయితే అక్కడికే వెళ్లిపోవాలన్నారు. రాష్ట్రం నుంచి పాలించాలనే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అమరావతికి వచ్చిందన్నారు. ఇప్పుడు హైదరాబాదే రాజధాని అంటే ఏం చేయగలమన్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్ నుంచి ఆమోదం రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ విఫలమయ్యారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించడంలో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విఫలమయ్యారని టీడీఎల్పీ ఉపనేత గోరంట్ల బుచ్చయ్య(Gorantla bucchaiah Chowdary) చౌదరి అన్నారు. హక్కులు కోసం సభ్యుల బలంతో సంబంధం లేకుండా పోరాడుతున్నామన్నారు. రెండేళ్లు కోవిడ్ ని అడ్డంపెట్టుకుని ప్రభుత్వం బతికిపోయిందన్నారు. గవర్నర్ ఉత్సవ విగ్రహంలా ఉండటం సబబుకాదనే గో బ్యాక్ అన్నామన్నారు. ప్రజా సమస్యలపై ఇక క్షేత్రస్థాయిలో పోరాడతామన్నారు. ఒక్క గొంతు నొక్కితే లక్ష గొంతులు మద్దతుగా వస్తాయన్నారు.