Payyavula On CM jagan : రాజధానిపై ప్రకటన కోర్టు ధిక్కారమే - సీఎం జగన్‌పై టీడీపీ నేత పయ్యావుల ఫైర్ !
రాజధానిపై ప్రకటన విషయంలో సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపించింది. వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే ఇలా చేశారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
Payyavula On CM jagan : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నపళంగా సీఎం జగన్.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని అన్నారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి.. ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారన్న అంశం ఇప్పుడు కీలకంగా మారిందని, ఆ కాల్ డేటా వివరాలు బయటకు రాకుండా.. ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం జగన్.. విశాఖ రాజధాని అంటూ ప్రకటన చేశారని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందన్న విషయాన్ని పయ్యావుల గుర్తుచేశారు. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్.. ఇంకా పెండింగ్‌లోనే ఉందని, ఇలాంటి సమయంలో సీఎం ప్రకటన కోర్టు ధిక్కరణే అవుతుందని చెప్పారు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.
ఉదయం ఢిల్లీలో పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్.. విశాఖకు రాజధానిని తరలిస్తున్నామని తాను కూడా త్వరలో అక్కడికి షిఫ్ట్ కాబోతున్నానని ప్రకటించారు. పరిశ్రమలు పెట్టుకొనేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందించడానికైనా తాను సిద్ధమని ఇన్వెస్టర్లకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను ఆయన ఇన్వెస్టర్లకు తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్ల నుంచి నెంబర్ వన్‌గా ఉంటూ వస్తోందని జగన్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్‌లలో మూడు ఏపీకే వస్తున్నాయని తెలిపారు.ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని, 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధానిగా మారుతోందని, రాబోయే కొద్ది నెలల్లోనే తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని సీఎం జగన్ తెలిపారు.
సీఎం జగన్ ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతానికి లీగల్‌గా ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే. కేంద్రం కూడా అదే విషయాన్నీ తెలిపింది. దానితో ఒకవేళ వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించాలి అంటే అసెంబ్లీలో మళ్ళీ బిల్ పెట్టాలి. దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. దానికి చాలాసమయం పట్టే అవకాశం ఉండడంతో ముందుగా సీఎం క్యాంపు కార్యాలయాన్ని వైజాగ్‌లో ఏర్పాటు చెయ్యనున్నారు. ఉగాది నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖ తరలించి వారంలో రెండు లేదా మూడు రోజులు అక్కడి నుండే పాలన సాగించనున్నారు ముఖ్యమంత్రి జగన్. మిగిలిన రోజుల్లో అమరావతి నుంచి పాలన సాగిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం .
విశాఖకు రాజధానిని తరలించే ప్రయత్నం వేగవంతం అవుతున్నవేళ రానున్న సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు మరోసారి అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు విశ్లేషకులు . తాజాగా సీఎం చేసిన ప్రకటనతో ఆ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఏదేమైనా సీఎం జగన్ తాను అతి త్వరలోనే హలొ వైజాగ్ అనడం ఖాయం అని తేల్చేశారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నరు.