(Source: ECI/ABP News/ABP Majha)
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
నాలుగు దశాబ్దాల కింద చరిత్ర తిరగరాసినరోజు అని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం పుట్టింది తెలుగు జాతి ఆత్మగౌరవం నుంచే. మీ సిద్దాంతం ఏంటి అన్నారు... హ్యూమనిజమే నా సిద్దాంతం అని ఎన్టీఆర్ అన్నారు.
41 ఏళ్ల క్రితం రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు ఈరోజు (మార్చి 29) అని, తెలుగు జాతి రుణం తీర్చుకోవాలి అని ఎన్టీఆర్ టీడీపీ పెట్టారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఆవిర్భావం పై ప్రకటన చేయాలనే ప్రతిపాదన ఆరోజు లేదు. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జనసందోహంలో అప్పటికప్పుడే ఎన్టీఆర్ పార్టీ ప్రకటించారని తెలిపారు. తెలుగు జాతి కోసం పార్టీ పెడుతున్నా... దాని పేరే తెలుగు దేశం అని ఎన్టీఆర్ అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు, తెలంగాణ, ఎపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలు పాల్గొన్నారు. నాలుగు దశాబ్దాల కింద చరిత్ర తిరగరాసినరోజు అని చంద్రబాబు అన్నారు. తెలుగు దేశం పుట్టింది తెలుగు జాతి ఆత్మగౌరవం నుంచే. ఎన్టీఆర్ ను మీ సిద్దాంతం ఏంటి అన్నారు... హ్యూమనిజమే నా సిద్దాంతం అని ఎన్టీఆర్ అన్నారు. పసుపు రంగును పార్టీ రంగుగా మార్చారు. పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం ఉంటుంది. నాగలి, చక్రం, పూరిల్లు చిహ్నంగా ఎన్టీఆర్ పార్టీ చిహ్నం రూపొందించారు. తెలుగు జాతి చరిత్ర... తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు... ఆవిర్భావం తరువాత అని చూడాల్సి ఉందన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొన్న శ్రీ @ncbn , స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి, టీడీపీ జెండా ఆవిష్కరించారు. (1/3) pic.twitter.com/TorZhReb5b
— Telugu Desam Party (@JaiTDP) March 29, 2023
సంక్షేమానికి నాంది టీడీపీ
ఒకప్పుడు ప్రభుత్వం అంటే పెత్తందారీ వ్యవహారం, దళారీ వ్యవస్థ. ఎన్టీఆర్ వచ్చాక వీటన్నింటీనీ మార్చారు. భారత దేశంలో సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికిన పార్టీ తెలుగు దేశం పార్టీ అన్నారు చంద్రబాబు. సవాల్ చేసి చెపుతున్నా... ఆహార భద్రత కోసం నాడే రూ.2 కిలోబియ్యం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు దేశంలో ఆహార భద్రత పథకాలు అమలు చేస్తున్నారు. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. మాండలిక విధానం తీసుకువచ్చి... అధికార వికేంద్రాకరణ చేసిన నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి అని డాక్టర్లు, ఇంజనీర్, లాయర్, పట్టభద్రులను రాజకీయాల్లోకి తెచ్చిన గొప్ప నేత.
మహిళలకు ఆస్థి హక్కు ఇచ్చింది ఎన్టీఆర్
దేశంలో మొట్టమొదటి సారి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు.. వారికి విద్య అందాలని వినూత్న కార్యక్రమాలు చేశారు. ఒకప్పుడు ఆడపిల్లలను చదవించేవారు కాదు. అయితే ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా యూనివర్సిటీ తెచ్చిన నాయకుడు ఆయన. మహిళలకు ఆస్థి హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రధాన్యం ఇచ్చారు. వారికి స్థానిక సంస్ధల్లో 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. నేను వచ్చిన తరువాత వాటిని 34 శాతం చేశాను. బడుగు బలహీన వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి తెచ్చిన పార్టీ తెలుగు దేశం అన్నారు చంద్రబాబు.
100 చోట్ల శతజయంతి ఉత్సవాలు
ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. మే 28 యుగపురుషుడు పుట్టి 100 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా తెలుగు జాతికి ఆత్మగౌరవం తెచ్చిన వ్యక్తి శతజయంతిని ఘనంగా నిర్వహించాలి. శతజయంతి సందర్భంగా రానున్న రెండు నెలల్లో 100 చోట్ల శతజయంతి ఉత్సవాలు జరగాలి. వచ్చే మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. అప్పటికి 100 చోట్ల శతజయంతి కార్యక్రమాలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్లమెంట్ లలో శతజయంతి కార్యక్రమాలు చేస్తాం. తెలుగు జాతి గర్వపడేలా అన్న శతజయంతి ఉత్సవాలు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 100 వెండి నాణెం విడుదలకు కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఐటీ రంగమే కాదు.. డ్వాక్రా సంఘాలను ప్రోత్సాహం
నాడు విద్యుత్, ఎయిర్ పోర్ట్ లు, టెలికమ్యూనికేషన్ లలో సంస్కరణలు చేశాం. ఒక్క హైటెక్ సిటీ నాడు ప్రారంభించాం. ఇప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో చూడండి. 25 ఏళ్లకు ముందు హైదరాబాద్ ఎలా ఉంది... నేడు నెలా ఉంది. ఒక్క ఐటీ రంగమే కాదు.. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించాం అన్నారు చంద్రబాబు. ఆడవాళ్లు ఒకరిపై ఆధారపడే అవకాశం లేకుండా డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాం. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను తీసుకువచ్చి వారి సామర్థ్యం నిరూపించాం.