Jagan Case : జగన్ కేసుల ట్రయల్ ఎందుకు ఆలస్యం - కారణాలు చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం
Andhra News : జగన్ కేసుల్లో విచారణ జాప్యంపై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేిసంది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
Supreme Court notices to CBI on delay in investigation in Jagan cases : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని కోరింది. విచారణ ఎందుకు జాప్యం అవుతుందో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. డిశ్చార్జ్ పిటిషన్‌ల వల్ల జాప్యం అవుతోందని కోర్టుకు సీబీఐ న్యాయవాది తెలిపారు.
రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సీఎం అన్న కారణంగా విచారణ జాప్యం కావొద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. విచారణ ప్రక్రియ వేగంగా జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు, మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లు కలిపి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.
రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు దాఖలు చేసారు. ఒకటి కేసుల విచారణ ఆలస్యం గురించి.. మరొకటి కేసుల విచారణ ఇతర రాష్ట్రానికి తరలించాలని. రఘురామ పిటిషన్ల పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. రెండు పిటిషన్లపై రిప్లైకి సీఎం జగన్ మరింత సమయం కోరారు. తదుపరి విచారణ ఆగస్ట్ 5 కి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉంటూ వస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు తరువాతే ఎంపీ రఘురామను అరెస్ట్ చేసి సీఐడీ కస్టోడియల్ టార్చర్ చేసింది. జగన్ బెయిల్ రద్దుపై సరైన విధంగా సీబీఐ స్పందించలేదు. సీబీఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామ కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్న జగన్... ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభం అయ్యి పదేళ్లయినా.. అభియోగాల నమోదు జరగకపోయినా.. దర్యాప్తు సంస్థ సంతోషంగా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఇవే విషయాలను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికి... పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసిందని రఘురామ తెలిపారు. తదుపరి విచారణలో ఏం జరుగుతుందన్నదానిపై జగన్ కేసులు ఎంత వేగంగా విచారణ జరుగుతాయన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.