Jagananna Amma Vodi : తల్లుల ఖాతాల్లో డబ్బులు, నేడు అమ్మఒడి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
Jagananna Amma Vodi : జగనన్న అమ్మ ఒడి పథకం కింద వరసగా మూడో ఏడాది లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయనున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం చేయనున్నారు.
Jagananna Amma Vodi : పేదరికం కారణంగా ఎవరూ బడిమానేయకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తుంది. కనీసం 75 శాతం అటెండెన్స్ ఉండాలని ఇందుకు నిబంధన పెట్టింది ప్రభుత్వం. 2019లో ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడే ఆ జీవోలోనే నిబంధనలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలో కరోనా కారణంగా విద్యాసంస్థలు అనుకోకుండా మూతపడడడంతో 2020–21 విద్యా సంవత్సరాలకు అటెండెన్స్ నిబంధన నుంచి సడలింపు నిచ్చింది.
75 శాతం హాజరు నిబంధన
గత సెప్టెంబర్ నుంచి విద్యా సంస్థలు యథావిధిగా పనిచేస్తున్నందున స్కూల్స్ నడిచిన రోజుల్లో 75 శాతం హాజరు నిబంధన తిరిగి అమలుచేయడంతో 2021–22లో 51,000 మంది అమ్మ ఒడి లబ్ధిని పొందలేకపోయారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. అప్పుడే ప్రభుత్వం అమలుచేస్తున్న జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, సీబీఎస్‌ఈతో బైజూస్ ఒప్పందంతో నాణ్యమైన విద్య వంటి కార్యక్రమాల లక్ష్యం నెరవేరినట్లు అవుతుందన్నారు. పిల్లలకు పూర్తి లబ్ధి చేకూరుతుందని, ప్రపంచంతో పోటీ పడగలిగే పరిస్థితి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
నాడు నేడు ఫండ్
మన బడి నాడు-నేడు ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యా్ర్థులకు అందాలన్న తపనతో అమ్మ ఒడి నిధుల నుంచి నాడు నేడులో స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ (ఎస్‌ఎంఎఫ్) కు రూ. 1,000 ప్రభుత్వం జమ చేస్తుంది. స్కూళ్లలో టాయిలెట్లు లేక ఆడపిల్లలు బడులు మానేసే దుస్థితి మారుస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద నిర్మించిన బాలికల ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం అమ్మ ఒడి పథకం నిధుల నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ (టీఎంఎఫ్) కు రూ. 1,000 జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్వహణలో ఏవైనా లోపాలుంటే హక్కుగా అడిగే పరిస్థితులను తల్లులకు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్, టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ల నిర్వహణ బాధ్యత కూడా హెడ్‌మాస్టర్లు, పేరెంట్స్ కమిటీలకు ప్రభుత్వం అప్పగించింది.
- 2019–20 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,349.53 కోట్లు
- 2020–21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,673.00 కోట్లు
- 2021–22 విద్యా సంవత్సరంలో 43,96,402 మంది లబ్ధిదారులకు చేసిన ఆర్థిక సాయం రూ. 6,595.00 కోట్లు
శ్రీకాకుళంలో అమ్మఒడికి శ్రీకారం
ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 43,96,402 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,595 కోట్లు జూన్ 27వ తేదీన లబ్దిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బటన్ నొక్కి సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సోమవారం అందిస్తున్న రూ. 6,595 కోట్లతో కలిపి ఇప్పటివరకు జగనన్న అమ్మ ఒడి పథకం కింద దాదాపు రూ. 19,618 కోట్లు అందించింది ప్రభుత్వం.