AP Cabinet meeting: శ్రీచరణికి విశాఖలో 500 గజాల స్థలం - ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
AP Cabinet: శ్రీచరణికి రెండున్నర కోట్లు, విశాఖలో స్థలం కేటాయిస్తూ ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పలు అభివృద్ధి, పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.

AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 44 అజెండా అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతి అభివృద్ధి, సమగ్ర నీటి నిర్వహణ ప్రాజెక్టులు, పెట్టుబడుల ప్రోత్సాహం, గిరిజన సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి డి. పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు.
అమరావతి ప్రాజెక్టులకు ఆమోదం
రాజధాని అమరావతి అభివృద్ధికి మంత్రివర్గం భారీ మద్దతు తెలిపింది. లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి పరిపాలనాత్మక అనుమతులు మంజూరు చేశారు. అలాగే, క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA)కు NABARD నుంచి రూ.7,258 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. సీడ్ యాక్సిస్ రోడ్‌ను NH-16కు అనుసంధానించే రోడ్ కనెక్టివిటీ పనులకు రూ. 532 కోట్ల బడ్జెట్‌తో టెండర్లు పిలవడానికి కూడా ఆమోదం తెలిపారు.
506 ప్రాజెక్టులకు రూ. 9,500 కోట్ల ఆమోదం
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన 506 ప్రాజెక్టులకు మంత్రివర్గం రూ.9,500 కోట్ల పరిపాలనాత్మక అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా, సేకరణ, పునర్వినియోగం వంటి అంశాలపై దృష్టి సారిస్తాయి. అలాగే, చిత్తూరు జిల్లా కుప్పం సంస్థానంలో పాలేరు నదిపై ఉన్న చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు ప్రత్యేక పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ చర్యలు రాష్ట్రంలో నీటి సమస్యలను తగ్గించి, పట్టణాల అభివృద్ధికి దోహదపడతాయని అధికారులు అంచనా.
20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి రూ.20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 56,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించబడనున్నాయి. అలాగే, పలు సంస్థలకు భూమి కేటాయింపులకు అనుమతి ఇచ్చారు. CRDA అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఈ చర్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని చెబుతున్నారు.
గిరిజన సంక్షేమ శాఖలో 417 మంది భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం గిరిజన విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. అలాగే, 'ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ బిల్' ముసాయిదా మీద సమావేశంలో విస్తృత చర్చ జరిగి ఆమోదం తెలిపారు. ఈ బిల్ జైళ్ల సంస్కరణలు, కొత్త సౌకర్యాలు, ఖైదీల పునరావృత్తికి దృష్టి సారిస్తుంది. సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రతిభలకు ప్రోత్సాహం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత మహిళా క్రికెట్ ప్లేయర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు మరియు విశాఖపట్నంలో 500 చదరపు గజాల భూమి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆమె రాష్ట్రానికి పేరు తెచ్చినందుకు ఈ బహుమతి అందజేయాలని సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ప్రతిపాదించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు తీసుకునే ఫైల్స్ క్లియరెన్స్‌ను 4-5 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలస్యాలు రాష్ట్ర అభివృద్ధిని ఆలస్యం చేస్తాయని హెచ్చరించారు. అలాగే, సమావేశానికి ఆలస్యంగా వచ్చిన ఆరుగురు మంత్రులపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.





















