![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
AP Election Results 2024: కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?
Andhra Pradesh News: ఏపీలో ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు జరగడంతో, కౌంటింగ్ కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం లేదని పోలీసులు తెలిపారు.
![AP Election Results 2024: కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా? security not increased at residences of AP CM Jagan and TDP chief Chandrababu Guntur police AP Election Results 2024: కౌంటింగ్‌కు ముందే సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/02/f8c56442ec7d93f834fab098dbfb86301717346549083233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
security not increased at residences of YS Jagan and Chandrababu| అమరావతి: ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో అసలు ఫలితాలపై చర్చ జోరందుకుంది. మరో రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసాలు, కార్యాలయాల వద్ద భద్రత భారీగా పెంచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఎన్నికల రోజు, ఆ తరువాత రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరగడంతో కౌంటింగ్ కు ముందే వైసీపీ అధినేత, టీడీపీ అధినేతలకు భద్రత పెంచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాలు, పార్టీ కేంద్ర కార్యాలయాలకు భద్రత పెంచారని ఫొటోలు చక్కర్లు కొట్టాయి.
స్పందించిన గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ
జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రత పెంచారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాల వద్ద సాధారణంగానే పటిష్ట భద్రత ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాల సమయం అని అదనపు భద్రత పెంచామన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ ఉండటంతో బందోబస్తుకు వచ్చిన సిబ్బంది వారి వారి డ్యూటీ పాయింట్ కు వెళ్తున్నారు. ఆ డ్యూటీలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది వస్తూ పోతూ ఉన్నందువల్లే సెక్యూరిటీ పెంచినట్లు భావించి ఉంటారన్నారు. కానీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద అదనపు భద్రత, బలగాలు పెంచడం నిజం కాదని స్పష్టం చేశారు.
కూటమి శ్రేణులకు చంద్రబాబు దిశా నిర్దేశం
కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు కూటమి శ్రేణులకు సూచించారు. ఆదివారం నాడు జూమ్ మీటింగ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో మాట్లాడుతూ.. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. వైసీపీ ఏమైనా కుట్రలు చేస్తే, తిప్పి కొట్టాలని సూచించారు. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
కూటమి కుట్రల్ని తిప్పికొట్టాలన్న సజ్జల
టీడీపీ సహా కూటమి నేతలు కౌంటింగ్ సమయంలో కుట్రలకు పాల్పడతారని, వైసీపీ శ్రేణులు సంయమనంగా ఉండాలని సజ్జల రామక్రిష్ణారెడ్డి సూచించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంతో చంద్రబాబు దిట్ట అని, ఆయనకు అందులో పీహెచ్‌డీ ఉందంటూ సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ సమయంలో ఏమైనా అనుమానాలు కలిగినా, తప్పులు కనిపిస్తే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ ఏజెంట్లకు సజ్జల సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)