AP Roads : వచ్చే వర్షాకాలానికి రోడ్లు బాగు - అధికారులకు జగన్ ఆదేశం..!
వర్షాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నా రోడ్లు పాడయ్యాయని జగన్ అన్నారు. వచ్చే వర్షాకాలానికల్లా రోడ్లను బాగు చేయాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. రోడ్లను గత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు.
వచ్చే వర్షాకాలనికల్లా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ చివరికి వర్షా కాలం ఆగిపోతుదని ఆ తర్వాత వెంటనే ప్రాధాన్యత ప్రకారం పనులు ప్రారంభించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపధ్యంలో సీఎం జగన్ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. వర్షాలు తగ్గగానే ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టిపెట్టాలని.. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలన్నారు.
Also Read : ఏపీలో రోడ్లేయడానికి కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదు ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అధికారులకు గుర్తు చేశారు. గత ప్రభుత్వం అసలు రోడ్ల గురించి పట్టించుకోలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు భారీ వర్షాలు పడ్డాయని.. రైతులు సంతోషంగా ఉన్నా... రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంది. ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని అధికారులకు సీఎం జగన్ తెలిపారు. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారని.. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే పిలవాలనిసూచించారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని ఫోకస్ పెట్టి వాటిని బాగుచేయాలని స్పష్టం చేశారు.
Also Read : విశాఖ - రాయ్‌పూర్ ఎకనమిక్ కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్
రోడ్లు సరిగ్గా లేవని మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం పీఠంలో లేకపోవడం వల్ల కొన్ని మీడియా సంస్థలు ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తున్నారని ఆరోపించారు. నెగెటివ్ ఉద్దేశంతో ప్రచారం చేసినా.. మనం చేయాల్సిన పనులు చేద్దామని పిలుపునిచ్చారు. మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దామని... మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే... నెగెటివ్ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారన్నారు. రోడ్లను బాగు చేసిన తర్వాత ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయని అధికారుకు తెలిపారు.
Also Read : ఏపీలో మద్యం బ్రాండ్లు అంత ప్రమాదకరమా..?
ఏపీలో రోడ్ల దుస్థితిపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమంమ చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ రోడ్లు పాడయ్యాయని ఫోటోలు, వీడియోలు ప్రజల ముందు ఉంచింది. రెండున్నరేళ్ల కాలంలో రోడ్ల కోసం ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వలేదని టీడీపీ ఆరోపిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నప్పటికీ ఆ నిధులను కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపిస్తోంది. ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టడానికి వచ్చే వర్షకాలంలోపు రోడ్ల బాగు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు.