YS Sharmila Shaking Comments : జగన్, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారా? షర్మిల సంచలన ఆరోపణలు; తూర్పు కాంగ్రెస్‌లో కుమ్ములాట!
YS Sharmila Shaking Comments : ఫోన్ ట్యాపింగ్ కేసులో జగన్, కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచల వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ ఒక్కటై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడననట్లు అనిపిస్తొందన్నారు.

YS Sharmila Shaking Comments : జగన్, కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒక్కటై ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారా అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇంత మంది ఫోన్‌లు ట్యాప్ చేశారన్న విషయం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించిన షర్మిల కాకినాడ జిల్లా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ప్రధాని మోడీ పాలనతో దేశంలో ఎమర్జన్సీ పరిస్థితి కనిపిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపమలు చేశారు. గత 11 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రధాని మోదీ రాష్ట్రానికి విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అన్యాయం చేశారన్నారు షర్మిల. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లులో కాదు 41 మీటర్లు నీటి నిల్వలోనే కడతారని, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చి కేవలం 83 వేల కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ మిగిల్చుకోవడానికి ఈ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆఖరికి రాష్ట్ర రాజధాని విషయంలో నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఎకనామిక్ ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తామని ఒక్కటీ అమలుచేయాలేదని గుర్తు చేశారు.
ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీకి ఓ వైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అధికారంలో ఉన్నా మోదీకి పనికొచ్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మోదీని ఎదిరించే సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందన్నారు షర్మిల. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే పార్టీ బీజేపీ అని అది ఒక రైటిస్ట్ పార్టీ అన్నారు. మతం పేరుతో చిచ్చుపెట్టి ఆమంటలో చలికాచుకోవడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పని అన్నారు. దేశంలో రాహుల్‌కు క్రేజ్ పెరుగుతోందని, రాహుల్ గాంధీని తక్కువ చేయాలని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నామని వివరించారు షర్మి. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. శ్రేణుల సమస్యలు తెలుసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది..
ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమని వైఎస్ షర్మిల అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, దీనికి వైవీ సుబ్బారెడ్డి తన ఇంటికే స్వయంగా వచ్చి చెప్పారన్నారు. ఇది చాలా దారుణమని, ఇది ప్రైవసీని హరించడమే అన్నారు. ఇంత మంది ఫోన్‌లు ట్యాప్ చేశారన్న విషయం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. దీనికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కటై ఫోన్ ట్యాపింగ్ చేయించారో లేక జాయింట్ ఆపరేషన్‌గా చేశారో తెలియదు కానీ ఇది జరిగిందన్నారు.
వాస్తవాలను బయట పెడుతున్న మీడియాపై దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు షర్మిల. ఈ సమావేశంలో కేంద్ర మాజీమంత్రి మంగపతి పల్లంరాజు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగా గౌతమ్, జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు, కేబీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
షర్మిల ఎదుటే కాంగ్రెస్ నేతల కుమ్ములాట..
అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముందే తమ అసమ్మతి కొందరు కాంగ్రెస్ నేతలు తెలియజేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు ఒకపక్క, మరోపక్క కొత్తవారిని ప్రోత్సహించరా అంటూ పీసీసీ చీఫ్ షర్మిల ముందే వాగ్వాదానికి దిగడంతో షర్మిల షాక్ అయ్యారు.
ఒక దశలో సమావేశం రసభాస అయ్యింది. రామచంద్రపురం కాంగ్రెస్ నాయకురాలు ఇసుకపట్ల శ్యామల తనను కారణం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని షర్మిల ముందు వాపోయారు. ఈ క్రమంలో కొందరు నాయకులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఈ గొడవను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, షర్మిల సెక్యూరిటీ బయటకు పంపించేశారు.





















