Rajahmundry: News: రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త, మామ అరెస్ట్ - కారణం ఏంటంటే!
Rajahmundry: News: ఫైనాన్స్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆయన తండ్రి అప్పారావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajahmundry: News: ఫైనాన్స్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు), ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ కార్యాలయానికి తరలించి మరీ విచారణ చేస్తున్నారు. రాజమండ్రి అర్బన్ టీడీపీ నియోజకవర్గ స్థానాన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రాజమండ్రీ అర్బన్ లో టీడీపీకి మంచి పట్టున్న కుటుంబంగా ఆదిరెడ్డి కుటుంబానికి పేరు ఉంది. శ్రీనివాస్ భార్య, అర్బన్ ఎమ్మెల్యే భవాని దివంగత టీడీపీ నేత ఎర్రంనాయుడు కుమార్తె, అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న కుమార్తె. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వంపై, స్థానిక ఎంపీ మార్గాన్ని భరత్ పై.. ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను, ఆయన తండ్రిని అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
నెలరోజుల క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు
నెలరోజుల క్రితమే ఆదిరెడ్డి శ్రీనివాస్.. ఎంపీ మార్గాని భరత్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాజమండ్రి... పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పై ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. అధికార అహంకారంతో వైఎస్సార్ సీపీ ఎంపీ భరత్ సాగిస్తున్న అభివృద్ధి పనులలో డొల్లతనం స్పష్టంగా బయట పడుతోంది అన్నారు. కనీసం అవగాహన లేకుండా ఇష్ఠారాజ్యంగా పనులు చేసుకుపోతున్నారని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అయన విమర్శించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. గతంలో అభివృద్ధి ఏమీ చేయనట్టు, తామే చేస్తున్నట్టు ఎంపీ బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
నిజానికి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కేరాఫ్ ఎడ్రెస్ అని ఆయన అన్నారు. అందుకే మూడుసార్లు నగర పాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అయన గుర్తుచేశారు. కార్పొరేషన్ భవనం అందుకు ఉదాహరణగా చెబుతూ, మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే, ఈపాటికి సెంట్రల్ ఏసీ అయ్యేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పేరిట సాగిస్తున్న పనులను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆదిరెడ్డి వాసు అన్నారు. మేడిపండు చూడ మేలిమి ఉండు, పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే చెందంగా ఏపీ ప్రభుత్వ పాలన ఉందని సెటైర్లు వేశారు.
పైన పటారం, లోన లొటారం..
రాజమండ్రికి డెవలప్ మెంట్ ను పరిచయం చేసింది టీడీపీ పార్టీ అన్నారు. అందువల్లే ప్రజలు తమపై విశ్వాసం నుంచి మూడుసార్లు కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం అన్నారు. కానీ వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తీరు ఎలా ఉందంటే.. రాజమండ్రి ప్రజలు ఇప్పటివరకు రోడ్లు చూడలేదు, వారికి రోడ్లు అంటే కూడా తెలియదు అనేలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. సుందరీకరణ తామే చేశామని ఎంపీ అంటున్నారని గుర్తుచేశారు. కంబా చెరువులోని లేజర్ షో కోసం కోటి రూపాయలు వెచ్చించారు. కానీ పట్టుమని నెల రోజులు కూడా లేజర్ షో పనిచేయలేదని, ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్న ప్రభుత్వం వైసీపీ సర్కార్ అన్నారు. అసలు ఎందుకు పని చేయడం లేదు, లేజర్ షో పై సమీక్షించుకోవాలన్నారు. ఎవరో చెప్పారని, రద్దీ చోట కోట్ల రూపాయల ప్రజల ధనాన్ని వెచ్చించారు. కానీ దాని వల్ల ప్రయోజనం లేదని ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు.