Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Andhra Pradesh News | తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి పాల్గొనగా, ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ మీటింగ్ కు ఎందుకు హాజరు కాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్గాని భరత్ ప్రశ్నించారు.
Margani Bharat questions AP Govt over Pawan Kalyan not attending CMs meeting | రాజమండ్రి: గత పదేళ్లుగా పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం (జులై 6న) హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారని, ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను భాగస్వామిని చేసింటే బాగుండేదని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. విభజన అంశాలపై తక్కువగా చర్చించి ఇతర అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేశారన్న మార్గాని భరత్.. టీడీపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గౌరవించాలని, ఆయనకు గుడి కట్టిన తక్కువే అన్నారు. పవన్ ఫ్యాక్టర్ కారణంగానే ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధించినట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో టీడీపీకి అధికారం..
మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందంటే 99 శాతం కారణం పవన్ కళ్యాణ్ అని, అందుకే టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ కి గుడి కట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సీఎంల సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చల్లో పాల్గొన్నారు, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొల్గొని ఉంటే ఆ సమావేశానికి మరింత ప్రాధాన్యత ఉండేదన్నారు. కేంద్రం ప్రమేయం లేకుండా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సమస్యలపై చర్చించుకుంటే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. భద్రాచలం వద్ద ఐదు గ్రామాలు తెలంగాణకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా ఏపీలోని పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పై తెలంగాణ హక్కు అడిగిందని ప్రచారం జరుగుతోందని.. వీటిపై ఏపీ మంత్రులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో మన భాగాన్ని దక్కించుకున్నాం
‘టీడీపీ అధికారంలో ఉందంటే 99 మార్కులు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చాయి. పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణుల మద్దతు వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందనేది నిజం. అందుకు రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై సీఎంల భేటీలో పవన్ కళ్యాణ్‌ను భాగస్వామిని చేస్తే బాగుండేది. బయట జరుగుతున్న ప్రచారంపై ఏపీ మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. నీటి పారుదలపై ఏ నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ తెలియదు. వైఎస్ జగన్ హయాంలో నాగార్జున సాగర్ కుడి కాల్వ ఏపీలో ఉంది. కనుక వైసీపీ హయాంలో స్పిల్ వేను మనం హస్తగతం చేసుకోగలిగాం. ఏపీకి రావాల్సిన ఆస్తులపై ఏం చర్చించారో క్లారిటీ రావాలి.
కేంద్రం మద్దతు లేకుండా సీఎంల భేటీకి అర్థముందా?
రెండు వారాల్లో అంత సులువుగా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావు. ఇదివరకే ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ ఉంది. ఇప్పుడు మరోసారి కమిటీలు వేయడం అది కూడా కేంద్రానికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం మద్దతు లేకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు. ఏపీ పునర్ విభజన చట్టం పదేళ్లపాటు ఉంటుందని, పదేళ్లపాటు పొడిగించాలని గతంలో పార్లమెంట్ లో నేను కోరాను. ఈ విషయంపై టీడీపీ ఎంపీలు ఏనాడూ చర్చించలేదు. జులై 6న హైదరాబాద్ లో జరిగిన భేటీ తరువాత ఏ నిర్ణయాలు తీసుకున్నారో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చింటే బాగుండేది.
భద్రాచలం చుట్టు పక్కల 5 గ్రామాలు, ఏపీలోని పోర్టుల్లో తమకు వాటా, తిరుమల ఆలయంలో భాగస్వామ్యంపై చర్చ జరిగిందని ప్రచారంలో ఉంది. షెడ్యూల్ 9, 10 లాంటి విభజన సమస్యలు పక్కనపెట్టి వేరే విషయాలపై చర్చించడం సబబు కాదు. ఏపీకి రావాల్సిన ప్రయోజనాలపై కాకుండా రాష్ట్రాన్ని నష్టాన్ని చేకూర్చే దిశగా చర్యలు ఉన్నాయని’ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు.
Also Read: 'నా విజయానికి టీటీడీపీ శ్రేణులు కృషి చేశారు' - తెలంగాణ గడ్డపై టీడీపీకి పునఃవైభవం వస్తుందన్న ఏపీ సీఎం చంద్రబాబు