CM Chandrababu: 'నా విజయానికి టీటీడీపీ శ్రేణులు కృషి చేశారు' - తెలంగాణ గడ్డపై టీడీపీకి పునఃవైభవం వస్తుందన్న ఏపీ సీఎం చంద్రబాబు
Telangana News: ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లని.. తన విజయానికి తెలంగాణ టీడీపీ నేతలు కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
AP CM Chandrababu Comments In NTR Bhavan: ఏపీలో తన విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు (NTR Bhavan) ఆయన ఆదివారం వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీటీడీపీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునఃవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాలు రెండు కళ్లు
తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లని.. ఏపీలో తన విజయానికి తెలంగాణ నేతలు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆత్మీయులను కలిసి అభినందనలు తెలియజేసేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. 'మీ అభిమానం చూస్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. తెలంగాణలో అధికారంలో లేకున్నా నాయకులు పార్టీని వదిలివెళ్లారే తప్ప కార్యకర్తలు, అభిమానులు పార్టీని వదల్లేదు. సంక్షేమానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్.. ఆయన అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. తెలుగుజాతి ఉన్నంతవరకూ టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటిని అవకాశంగా మార్చుకుని మళ్లీ అధికారంలోకి వచ్చాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులు చూపిన చొరవ ఎప్పటికీ మరువలేను. చాలా దేశాల్లోనూ నా అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను మరిచిపోలేను. హైదరాబాద్‌లో నాకు మద్దతుగా ఆందోళనలు చేశారు. వారి ప్రేమ, అభిమానం ఎన్నటికీ మరువలేనిది' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'ఇరు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయం'
ఏపీ, తెలంగాణ అభివృద్ధే టీడీపీ ధ్యేయమని చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి టీడీపీ హయాంలోనే నాంది పలికామని.. తన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయని చెప్పారు. దీన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని.. తెలుగు భాష, జాతి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువని.. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ విధ్వంస పాలనతో చాలా నష్టం జరిగిందని అన్నారు.
సీఎంల భేటీలో కీలక అంశాలపై చర్చ
అటు, ఇరు రాష్ట్రాల సీఎంలు శనివారం ప్రజాభవన్‌లో విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా భేటీ అయ్యారు. ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి, సీఎస్ నీరభ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సలహాదారులు వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, వేణుగోపాల్ రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థికశాఖ కార్యదర్శి సహా ఉన్నతాధికారులు భేటీలో పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి సీఎస్ సహా ముగ్గురు ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఒకవేళ ఈ కమిటీతో పరిష్కారం కాని అంశాలపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.