Dindi Chinchinada Bridge: దిండి-చించినాడ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు, వారికి మాత్రమే పర్మిషన్- ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే
Konaseema News | కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి - చించినాడ బ్రిడ్జిపై శుక్రవారం నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు.

West Godavari News | కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి - చించినాడ బ్రిడ్జిపై శుక్రవారం నుంచి రాకపోకలు బంద్ కానున్నాయి. బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. ఈ బ్రిడ్జి అప్పటి దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చొరవతో నిధులు సమకూరి 1995 లో నిర్మాణం మొదలు పెట్టి 2001లో ప్రారంభించారు. ఈ వంతెనకు అత్యవసర మరమ్తత్తులు చేపట్టాల్సిన పరిస్థతుల నేపథ్యంలో మరమ్మత్తుల నిమిత్తం ఈ వంతెనపై రాకపోకలు పూర్తిగా తాత్కాలికంగా నిలిపివేశారు.
216 జాతీయ రహదారిలో కీలక బ్రిడ్జిగా ఉన్న ఈ వంతెన పై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన క్రమంలో అంబేడ్కర్ కోనసీమ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పశ్చిమ గోదావరి ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వంతెన మరమ్మత్తులు పూర్తయ్యే దాకా రావులపాలెం మీదుగా వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్యవసర మరమ్మత్తుల నిమిత్తం బ్రిడ్జి మూసివేత..
పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ గ్రామం - దిండి గ్రామం, మల్కిపురం మండలం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మధ్యలో నేషనల్ హైవే- 214 ను కలుపుతూ వశిష్ఠ నదీ పాయపై ఉన్న బ్రిడ్జి నర్మించి 25 ఏళ్లు పూర్తి కాగా ఈ వంతెన రక్షణ గోడలు, జాయింట్‌లు చాలా వరకు పాడైన పరిస్థితి తలెత్తింది. ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్న క్రమంలో బ్రిడ్జి చాలా దారుణంగా వైబ్రేషన్ వస్తోందని, దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారంటున్నారు.
1995 నుండి 2001 వరకు భీమవరం ఆర్ అండ్ బి స్పెషల్ డివిజన్ ద్వారా నిర్మితమైన చించినాడ వంతెన (చించినాడ బ్రిడ్జ్)ప్రస్తుతం అత్యవసరంగా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు.. గురువారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ లో రోడ్డు రవాణా, ఆర్ అండ్ బి ఆర్టీ సీ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి చించినాడ వంతెనపై రాకపోకలు నిలుపుదల చేస్తూ రావులపాలెం మీదు గా రాకపోకలు సాగించాలని ఆదేశించారు.
లైట్ మోటారు వెహికల్స్‌కు మినహాయింపు..
దిండి - చించినాడ కలుపుతూ వశిష్ట నదిపై ఉన్న బ్రిడ్జికి అత్యవసర మరమ్మత్తులు చేపడుతున్న క్రమంలో భారీ వాహనాలను పూర్తిగా నిలివేస్తుండగా.. లైట్ మోటారు వెహికల్స్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం చించినాడ వంతెనపై అత్యవసర మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించగా మరమ్మత్తులు పూర్తయ్యే వరకు, ఈ వంతెనపై గరిష్ఠంగా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో కేవలం లైట్ మోటార్ వెహికల్స్ ప్రయాణించడా నికి మాత్రమే అనుమతి ఇవ్వబడిందనీ మిగతా అన్ని రకాల వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.
హెవీ మోటారు వెహికల్స్ కోసం దారి మళ్లింపు..
హెవీ మోటార్ వెహికల్స్ కోసం కత్తిపూడి నుంచి నర్సాపురం/ భీమవరం వైపు ప్రయాణించే వారు కత్తిపూడి- జగ్గంపేట రాజమహేంద్రవరం
పాలకొల్లు నర్సాపురం / భీమవరం వెళ్లాల్సి ఉంది..
కాకినాడ నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు రావు లపాలెం సిద్ధాంతం మీదుగా వెళ్లాలి..
కాకినాడ, రామచంద్రాపురం మండపేట నుంచి వెళ్లేవారు రావులపాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నర్సాపురం / భీమవరం చేరుకోవాల్సి ఉంది.
అమలాపురం నుంచి నర్సాపురం / భీమవరం వైపు వెళ్లేవారు అమలా పురం - కొత్తపేట, రావుల పాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నరసాపురం భీమవరం చేరుకోవాల్సి ఉంది.
తాటిపాక/రాజోలు నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు తాటిపాక.. పి.గన్నవరం ఈతకోట, సిద్ధాంతం మీదుగా పాలకొల్లు, నరసాపురం, భీమవరం చేరుకోవాలి.
యానాం నుంచి బయలుదేరే వారు ద్రాక్షారామ రావులపాలెం, సిద్దాంతం మీదుగా పాలకొల్లు, నరసాపురం భీమవరం చేరుకోవాలి.
నరసాపురం నుంచి రాజోలు వైపు వెళ్లేవారు భీమవరం పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నరసాపురం నుంచి రాజోలు బయలుదేరే వారు దిగమర్రు పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాల్సి ఉంది.
ప్రజల సౌకర్యార్థం, రవాణా భద్రతను దృష్టిలో ఉంచు కొని ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు ఆర్టీసీ ఆర్ఎం రాఘవ శ్రీనివాసు, జాతీయ రహదారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయి శ్రీనివాసు, జాతీయ రహ దారులు ఏఈ వెంకట రమణ తదితర అధికారులతో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ సూచనలు చేశారు.





















