Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు
Chandrababu Custody News: స్కిల్ కేసులో అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని చంద్రబాబుకు కోడలు బ్రాహ్మణి వివరించారు.
Nara Bhuvaneswari and Brahmani meets chandrababu:
రాజమహేద్రవరం: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబును భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలిశారు. అధికారులు 40 నిమిషాల సమయం కేటాయించగా.. ఈ ముగ్గురు చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ముఖ్యంగా చంద్రబాబు ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నా భువనేశ్వరి , బ్రాహ్మణి. కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ ముగిసింది.
ఎలాంటి ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు తనను విచారించారని చంద్రబాబు వారికి తెలిపారు. చంద్రబాబును చూసి భార్య భువనేశ్వరి కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యంగా ఉండాలని బ్రాహ్మణిని ప్రత్యేకంగా కోరారు చంద్రబాబు. కుమారుడు లోకేశ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు బాసటగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు చంద్రబాబు. స్కిల్ కేసులో అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోందని చంద్రబాబుకు బ్రాహ్మణి వివరించారు. చంద్రబాబుకు మద్దతుగా పార్టీ నేతలు, ప్రజలు, ఐటీ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు బ్రాహ్మణి. రాష్ట్రం ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించారు.
అన్నవరం సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు
జగ్గంపేట నిరసన దీక్షలో పాల్గొనకముందు నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి వారిని నారా భువనేశ్వరి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని, ప్రజల సొమ్ముకోసం ఆశపడే ఫ్యామిలీ తమది కాదన్నారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా అవినీతి మరక అంటించి చంద్రబాబును 17 రోజులుగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనేం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు అని భువనేశ్వరి ప్రశ్నించారు. తాను హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నానని.. అందులో 2 శాతం అమ్ముకున్నా రూ.4 వందల కోట్లు వస్తాయని.. ప్రజల సొమ్ము తమకు అవసరం లేదన్నారు.
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం కాగా, ముందుగా బెయిల్ పిటిషన్ విచారించాలని చంద్రబాబు తరఫు లాయర్లు పదే పదే రిక్వెస్ట్ చేశారు. మరోవైపు సీఐడీ తరఫు లాయర్లు 5 రోజుల కస్టడీ పిటిషన్ విచారించాలని జడ్జిని కోరారు. ముందు తాము పిటిషన్ వేశామని, తొలుత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు కోరగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఏ పిటిషన్ ఎప్పుడు విచారించాలో కూడా మీరే మాకు చెబుతారా అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ రెండు పిటిషన్లను మంగళవారం విచారిస్తామని రేపటికి వాయిదా వేసింది కోర్టు. 2 పిటిషన్లను పూర్తి స్థాయిలో విచారించిన తరువాత తీర్పు వెల్లడించనుంది ఏసీబీ కోర్టు.