Kakinada Fire Accident: పండుగ సరుకుల కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా మారిన సార్లంకపల్లె.. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం
కాకినాడ జిల్లా సార్లంకపల్లె గిరిజన తండాలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 38 పూరిళ్లు కాలిబూడిదవ్వగా, 120 మంది గిరిజనులు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు

Andhra Pradesh News | రౌతులపూడి: రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ చేసుకునేందుకు ఊరు సిద్ధంగా ఉంది. కానీ ప్రమాదవశాత్తూ ఆ గ్రామంలో అని ఇళ్లు మొత్తం కాలిపోవడం వారికి నిలువు నీడ లేకుండా చేసింది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మారుమూల మన్యంలో ఉన్న ఈ తండాలోని 38 పూరిళ్లు అగ్నికి ఆహుతవగా, కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఈ ప్రమాదంతో దాదాపు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. అడవిపై ఆధారపడి జీవించే వీరి ఆస్తులన్నీ కళ్లముందే బూడిదైపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పండుగ సామాను కోసం వెళ్లొచ్చేసరికి శ్మశానంలా గ్రామం..
సంక్రాంతి పండుగ వేళ కావడంతో సరుకులు కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా సోమవారం సాయంత్రం తుని పట్టణానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేలోపే ఊరంతా మంటల్లో చిక్కుకుంది. మంటలు ఎంత వేగంగా వ్యాపించాయంటే, ఊరిలో ఉన్న కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. తుని నుంచి అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికి ఊరంతా మంటల్లో కాలి బూడిదైంది. అప్పటివరకు సంతోషంగా పండుగ జరుపుకోవాలనుకున్న గిరిజనులకు తమ ఇళ్లు శ్మశానంలా మారడం చూసి తట్టుకోలేకపోయారు.
ప్రమాద వార్త తెలుసుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ వెంటనే సార్లంకపల్లెకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా సమన్వయం చేశారు. అసలే చలికాలం, ఆపై పండుగ పూట ఇళ్లు కోల్పోయిన గిరిజనులను ఆదుకోవాలని బంధువలు, చుట్టుపక్కల గ్రామాలవారు కోరుతున్నారు.
కరెంటు లైన్లకు లారీ తగిలి అగ్నిప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. కందులపాడు గ్రామంలో వరి గడ్డి లోడుతో వెళ్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వరి గడ్డిని లోడు చేసుకుని వెళ్తున్న ఒక లారీ, గ్రామ వీధుల గుండా వెళ్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లకు తగిలింది. గడ్డి కావడంతో నిప్పు రవ్వలు పడగానే మంటలు క్షణాల్లో లారీ అంతటా వ్యాపించాయి. మంటల ధాటికి లారీ డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో సకాలంలో ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో మంటలు ఉధృతమయ్యాయి. స్థానికులు నీటితో ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా కందులపాడు ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.






















