Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
AP Employee DA Arrears | ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి వేళ శుభవార్త చెప్పింది. పెండింగ్ డీఏ, డీఆర్, అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది.

Sankranti 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ భారీ తీపి కబురు అందించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న డీఏ (DA), డీఆర్ (DR) బకాయిలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.70 లక్షల మందికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ. 1,100 కోట్లు
రాష్ట్ర ఆర్థిక శాఖ మొత్తం రూ. 2,653 కోట్ల నిధులను వివిధ వర్గాల చెల్లింపుల కోసం కేటాయించింది. ఇందులో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసం రూ. 1,100 కోట్లను విడుదల చేశారు. దీనివల్ల 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవుల కోసం రూ. 110 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది, దీనివల్ల సుమారు 55 వేల మంది పోలీసు సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.
కాంట్రాక్టర్లకు సర్కార్ గుడ్ న్యూస్
మరోవైపు, ఏపీలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూడా ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ వంటి పనుల నిమిత్తం రూ. 1,243 కోట్లను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న 'నీరు-చెట్టు' బిల్లుల కోసం రూ. 40 కోట్లను ప్రభుత్వం క్లియర్ చేసింది. ఈ మొత్తం చెల్లింపుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 వేల మంది కాంట్రాక్టర్లకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది. సంక్రాంతి కానుకగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల వివరాలు
| వర్గం | విడుదలైన మొత్తం) | లబ్ధిదారులు |
| డీఏ & డీఆర్ ఎరియర్స్ | రూ. 1,100 కోట్లు | 4.95 లక్షల మంది (ఉద్యోగులు & పెన్షనర్లు) |
| పోలీసుల సరెండర్ లీవులు | రూ. 110 కోట్లు | 55 వేల మంది పోలీసులు |
| కాంట్రాక్టర్ల బిల్లులు (EAP, NABARD, etc.) | రూ. 1,243 కోట్లు | 19 వేల మంది కాంట్రాక్టర్లు |
| మొత్తం | రూ. 2,653 కోట్లు | 5.70 లక్షల మంది |






















