ఆ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు- మాజీ ఎంపీ హర్షకుమార్
రూ 12 వేల కోట్ల రూపాయలు అదానీకి రుణమాఫీ చేశారని, దాన్ని పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అత్యవసరంగా కేసులు వేసి, ఆగమేఘాల మీద కోర్టులో తీర్పు వచ్చేలా చేశారని హర్ష కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో రాహుల్ గాంధీ పై వేయడం పార్లమెంట్ చరిత్రలో దురదృష్ట సంఘటన అని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయని అన్నారు. రూ 12 వేల కోట్ల రూపాయలు అదానీకి రుణమాఫీ చేశారని, ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకే రాహుల్ గాంధీపై అత్యవసరంగా కేసులు వేసి, ఆగమేఘాల మీద కోర్టులో తీర్పు వచ్చేలా చేసి పార్లమెంట్ నుంచి గెంటి వేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీపై ఫ్రీ ప్లాంట్ గాని కేసులు పెట్టి అనర్హత వేటు వేశారని విమర్శించారు. అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నప్పటికీ విమర్శించకూడదని ప్రతిపక్షాలకు స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు.
ప్రతిపక్షాలు గొంతు నొక్కిందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి చెందిన తరువాత ఆమె స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి గా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు బిజెపి ప్రభుత్వం ఆమెపై కేసులు పెట్టి జైల్లో పెట్టిందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 2014 ఎన్నికలలో రుణాలు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతున్న వారిని తీసుకువచ్చి రుణాలు వసూలు చేస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు ఎగవేసిన వారిని రహస్యంగా విదేశాలకు పంపిస్తున్నారని అన్నారు. ఓఎన్జీసీ అండర్ గ్రౌండ్ బావులు నుంచి అంబానీ చమురు దొంగతనం చేశారని ఆరోపించారు. రూ 45 వేల కోట్లు ఖర్చుతో పిపి మోడల్ కింద అంబానీ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారని, అయితే 2004 నుంచి దానికి అంత ఖర్చు అయింది ఎంత మిగిలింది పెట్రోల్ బంకులు ప్రభుత్వానికి ఎప్పుడు చెప్తారు అనేది ఇప్పటికీ చెప్పడం లేదని అన్నారు.
దళిత క్రిస్టియన్ లను ఎస్సీల్లో చేర్చినా ఒరిగేదేమీ లేదు :
రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేస్తూ తీర్మానం ఆమోదించినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసి దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేరుస్తూ సోనియా గాంధీ పార్లమెంట్లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం దానిని అడ్డుకోవడంతో బిల్లు ఆమోదించలేదని అన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తీర్మానం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను ఎత్తివేసిందని, అమ్మ ఒడి పేరుతో విద్యార్థులకు అందిస్తున్న ఆర్థిక సహాయం గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే తక్కువేనని అన్నారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని, దీనికి కారణం జగన్ ఒంటెత్తిపోకడలే అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. దళితులపై దాడులు చేసిన వారిని కేసులు పెట్టి అరెస్టు చేయకుండా వారిని రక్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దళితులపై దాడులు జరిగాయని గెడ్డం శ్రీను, డాక్టర్ సుధాకర్ తదితరులు పై దాడులు జరిగిన నిందితులను అరెస్టు చేయలేదని అన్నారు. పూజారులకు పాస్టర్లకు ఇమామ్ లకు గౌరవ వేతనం ఇస్తానని ఒక నెల మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తాం :
పేద ప్రజల ను ఆదుకునేందుకు పే బ్యాక్ టు సొసైటీ విధానంతో నేషనల్ అప్పర్ క్లాసెస్ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా సమయంలో కొందరు పనులు లేక పస్తులు ఉన్నారని, కొందరికి వైద్య సహాయం అందలేదని ఇలాంటి వారి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో తనతోపాటు యర్రా రామకృష్ణ తదితరులు ఉంటారని అన్నారు.