Eluru District News: పైప్ లైన్ కోసం భూమిని తవ్వితే బంగారం పడింది
Eluru District News: ఆయిల్ పాం తోటలో పైప్ లైన్ కోసం తవ్వగా.. బంగారు నాణేలు బయటపడ్డాయి. పురాతన కాలానికి చెందిన మొత్తం 18 నాణేలు దొరికాయి.
Eluru District News: ఆయిల్ పాం తోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు జరపగా... పురాతన కాలానికి చెందిన 18 నాణేలు దొరికాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామ పరిధిలో ఈ ఘటన జరిగింది. గతనెల 29వ తేదీన మానుకొండ తేజస్వికి చెందిన ఆయిల్ పాం తోటలో పైప్ లైన్ కోసం తవ్వకాలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే కూలీలకు నాణేలున్న మట్టి పిడత కనిపించింది. వెంటనే వాళ్లు ఆ విషయాన్ని తేజస్వి భర్త సత్య నారాయణకు తెలిపారు. వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకున్న ఆయన దాన్ని పరిశీలించారు. పగులగొట్టి చూడగా అందులో బంగారు నాణేలు ఉండడం గుర్తించాడు.
వెంటనే స్థానిక తహసీల్దార్ పి.నాగమణి వచ్చి నాణేలతో పాటు వాటిని ఉంచిన మట్టి పిడతను పరిశీలించారు. ఒక్కో నాణేం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నాయని నిర్ధారించారు. అయితే ఈ నాణేలు రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.
నల్గొండ పొలంలో 38 వెండి నాణేలు..
10 నెలల క్రితం నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటున్నాడు. అయితే పనిలో భాగంగా.. గట్లు తీస్తున్న సమయంలో.. మెుదట మట్టిపాత్ర దొరికింది. ఆ తర్వాత ఓ చిన్న ఇనుప పెట్టెసైతం దొరికింది. అప్పటికే ఏదో ఉంది అందులో అనే ఆత్రుత మెుదలైంది రైతుకు. ఆ పక్కనే తన సోదరుడి పొలం ఉంది. వాళ్లు ఉన్నది పట్టించుకోకుండా.. వాటిని తెరిచాడు ఆ రైతు.
మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు కనిపించాయి. విరిగిపోయిన 14 వెండి రింగులు కూడా ఉన్నాయి. ఇక ఇనుప పెట్టే తెరిచి చూసేసరికి.. అందులో.. 19 బంగారు బిళ్లలు, ఐదు చిన్నచిన్న బంగారు గుండ్లు కనిపించాయి. అయితే అందులో దొరికిన వెండి నాణేలపై.. ఉర్దూ పదాలు రాసి ఉన్నాయి. ఆ రైతు సోదరుడి పొలంలోకి పనికి వచ్చిన కొంత మంది మహిళలు.. నాణేలను తలా ఒకటి తీసుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళ.. తనకు పూనకం వచ్చినట్టు ఊగి.. వాటిని ముట్టుకోవద్దని హెచ్చరించింది. వాటిని తీసుకుంటే... మంచిది కాదని చెప్పింది. దీంతో భయపడిన మహిళలు.. వాటిని అక్కడే వదిలేశారు.
పొలంలో దొరికిన వాటిని ఆ రైతు తీసుకెళ్లి.. పెంటకుప్పలో పెట్టాడు. ఈ విషయం తెలిసిన రైతు సోదరుడు వచ్చి.. గట్టుపై దొరికింది కాబట్టి.. తనకూ వాటా కావాలని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ మెుదలైంది. విషయం ఆ ఊరి పెద్ద వరకు వెళ్లింది. సమానంగా పంచుకుంటే.. ఇద్దరికీ మంచిదని .. పెద్దమనిషి సూచించాడు. అయినా.. ఈ గుప్త నిధులపై సమస్య పోలేదు. గొడవలు ఇంకా ఎక్కువ అవ్వడం మెుదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక.. తనకు పొలంలో దొరికిన గుప్త నిధులను తీసుకెళ్లి రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు ఆ రైతు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని పోలీసులు తెలిపారు.